మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 21, 2020 , 03:37:03

జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టులో ఏడీపీకి వాటా

జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టులో ఏడీపీకి వాటా
  • ఫ్రాన్స్‌ సంస్థ చేతికి 49 శాతం l డీల్‌ విలువ రూ.10,780 కోట్లు
  • తొలి విడుతగా రూ.5,248 కోట్ల చెల్లింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: జీఎమ్మార్‌ విమానాశ్రయాల వ్యాపారంలో ఫ్రాన్స్‌కు చెందిన గ్రూపే ఏడీపీ 49 శాతం వాటాను సొంతం చేసుకుంటున్నది. జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీఏఎల్‌) బిజినెస్‌ విలువను రూ.22 వేల కోట్లుగా లెక్కించి ఈ లావాదేవీలకు దిగారు. దీంతో 49 శాతం వాటా కోసం ఏడీపీ రూ.10,780 కోట్లు ఇవ్వాల్సి వస్తున్నది. ఇరు సంస్థల మధ్య ఈ మేరకు వాటా విక్రయ ఒప్పందం జరిగినట్లు గురువారం ఓ ప్రకటనలో జీఎమ్మార్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌) తెలియజేసింది. తొలి వాయిదా కింద తక్షణమే రూ.5,248 కోట్లు అందుకుంటున్నట్లు సదరు ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. కాగా, జీఎమ్మార్‌ గ్రూప్‌ షేర్ల కోసం రూ.9,780 కోట్లను ఇస్తున్న ఏడీపీ.. రూ.1,000 కోట్లను జీఏఎల్‌లో ఈక్విటీగా పెడుతున్నది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంతో జీఎమ్మార్‌ గ్రూప్‌ రుణాలు తగ్గుతాయని, పరపతి మెరుగు పడుతుందని, నగదు నిల్వలు పెరుగుతాయని, మరిన్ని లాభాలు వస్తాయన్న ఆశాభావాన్ని జీఐఎల్‌ వ్యక్తం చేసింది. ‘అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టు డెవలపర్‌, ఆపరేటర్‌గా ఎదగాలన్న లక్ష్యంలో భాగంగానే ఏడీపీకి వాటాను అమ్ముతున్నాం. ఏడీపీతో కలయిక గ్లోబల్‌ మార్కెట్లలోకి సులువైన ప్రవేశానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నాం. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణకు, ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలను అందించడానికి ఇరు సంస్థలు మరింత కృషి చేస్తాయి’ అని జీఎమ్మార్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు ఈ సందర్భంగా అన్నారు. కొత్త మార్గాల అభివృద్ధి, కార్యకలాపాల విస్తరణ, రిటైల్‌, ఐటీ, ఇన్నోవేషన్‌, ఇంజినీరింగ్‌ వంటి ఎన్నో విభాగాల్లో ఇకపై కలిసి ముందుకెళ్తామన్నారు. 2019 ప్రయాణీకుల గణాంకాల ప్రకారం జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌, గ్రూపే ఏడీపీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో 336.5 మిలియన్ల మంది రాకపోకల్ని చూశాయి. ఇక ఈ లావాదేవీల అనంతర సంస్థలో జీఎమ్మార్‌దే మెజారిటీ వాటా ఉంటుండగా, ఏడీపీకి జీఏఎల్‌, అనుబంధ  బోర్డుల్లో ప్రాధాన్య స్థానం ఉండనున్నది. దేశీయంగా హైదరాబాద్‌, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను జీఎమ్మార్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


logo
>>>>>>