శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Feb 24, 2020 , 00:15:20

తీవ్ర ఒత్తిడిలో సూచీలు!

తీవ్ర ఒత్తిడిలో సూచీలు!
  • జీడీపీ, మౌలిక గణాంకాలపై మదుపరుల దృష్టి
  • ఈవారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: వరుసగా కొన్ని వారాలుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ అదే ట్రెండ్‌ కొనసాగించవచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత నెలకుగాను డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ఈవారంలోనూ ముగియనుండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనపై మదుపరులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. శుక్రవారం విడుదల కానున్న జీడీపీ అంచనాలు, మౌలిక సదుపాయాల గణాంకాలు కూడా మార్కెట్లపై ప్రభావితం చేయనున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఫిబ్రవరి నెలకుగాను ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌అండ్‌వో) కాంట్రాక్టు గడువు ముగియనుండటం, ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో భారత్‌-అమెరికా దేశాల మధ్య భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నదన్న సంకేతాలు మార్కెట్లను నడిపించనున్నాయని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. కరోనా వైరస్‌ దెబ్బకు మూతపడిన చైనాలో పరిశ్రమలు తిరిగి యథావిధిగా ప్రారంభమవుతుండటంతో భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం స్టాక్‌ మార్కెట్లకు సానుకూల అంశమన్నారు. వీటితోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు కూడా ప్రభావితం చేసే అంశాల్లో ఇవి కీలకమని వ్యాఖ్యానించారు. గతవారంలో సెన్సెక్స్‌ 87 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు పతనం చెంది. మహాశివరాత్రి సందర్భంగా గతవారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకు పరిమితమైంది. 

23 వేల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నప్పటికీ విదేశీ పెట్టుబడిదారుల ఇన్వెస్ట్‌మెంట్లు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత నెలలో దేశీయ మార్కెట్లోకి ఎఫ్‌పీఐలు రూ.23,102 కోట్ల మేర నిధులు చొప్పించారు. వచ్చే ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వు బ్యాంక్‌ కీలక నిర్ణయాలు పెట్టుబడులకు ఊతమిస్తున్నాయి. డిపాజిటరీ వద్ద ఉన్న తాజా సమాచారం ఆధారంగా..ఈ నెల 3 నుంచి 20 లోపు ఈక్విటీల్లోకి రూ.10,750 కోట్లు, డెబిట్‌ మార్కెట్లోకి రూ.12,352 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. మొత్తంగా రూ.23,102 కోట్లు. గతేడాది అక్టోబర్‌ నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, గత సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఎఫ్‌పీఐలను పెట్టుబడుల వైపు నడిపించిందని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైయిజర్‌ ఇండియా హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. బడ్జెట్‌లో డివిడెండ్‌ డిస్టిబ్యూషన్‌ ట్యాక్స్‌ను ఎత్తివేయడం, కార్పొరేట్‌ బాండ్లలో ఎఫ్‌పీఐల పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం వారిలో నమ్మకాన్ని పెంచింది. 


logo