శనివారం 04 జూలై 2020
Business - May 25, 2020 , 00:13:58

అంతర్జాతీయమే కీలకం

అంతర్జాతీయమే కీలకం

  • ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈవారం స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు కూడా మదుపరులను ఆందోళనకు గురి చేస్తున్నది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంక్‌లు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు నిరుత్సాహకరంగా ఉండటంతో గతవారం రోజులుగా తీవ్ర ఊగిసలాడిన సూచీలు ఈ వారంలోనూ ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. మరోవైపు వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్‌ బాదితుల సంఖ్య కూడా కలవరానికి గురిచేస్తున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు దృష్టి సారించే అవకాశం ఉన్నదని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. వీటితోపాటు ఈవారంలో విడుదల కానున్న హెచ్‌డీఎఫ్‌సీ, డాబర్‌ ఇండియా, లుపిన్‌, టీవీఎస్‌ మోటర్‌, వోల్టాస్‌ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి. గతవారంలో సెన్సెక్స్‌ 425.14 పాయింట్లు లేదా 1.36 శాతం పతనం చెందింది. 

ఎఫ్‌పీఐల పెట్టుబడి 9 వేల కోట్లు 

ఎఫ్‌పీఐ మళ్లీ నిధులను విదిల్చారు. కరోనా వైరస్‌తో వరుసగా రెండు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు రూ.9 వేల కోట్ల నిధులను చొప్పించారు. స్టాక్‌ మార్కెట్లు తిరిగి లాభాలబాట పట్టడం, హెచ్‌యూఎల్‌ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఎఫ్‌పీఐల్లో నమ్మకం పెరిగింది. దీంతో మార్చిలో రూ.61,793 కోట్లు, ఏప్రిల్‌లో రూ.6,883 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు ఆ మరుసటి నెలల్లోనే భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం. ఫిబ్రవరిలో రూ.1,820 కోట్ల పెట్టుబడులు పెట్టా రు. తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు మే 1 నుంచి 22 లోపు ఈక్విటీ మార్కెట్లలోకి రూ. 9,089 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..డెబిట్‌ మార్కెట్ల నుంచి మా త్రం రూ.21,418 కోట్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుత నెలలో జరిగిన 15 ట్రేడింగ్‌లలో 12 ట్రేడింగ్‌లలో ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెట్టారని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. 


logo