ముంబై, సెప్టెంబర్ 3: వరుసగా రెండు వారాలుగా తగ్గుముఖం పట్టిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఆగస్టు 27తో ముగిసిన వారాంతానికిగాను 16.663 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ నిల్వలు రికార్డు స్థాయి 633.558 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) అధికమవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. అంతక్రితం వారంలో ఫారెక్స్ రిజర్వులు 2.47 బిలియన్ డాలర్లు తగ్గి 616.895 బిలియన్ డాలర్లకు పరిమితమైన విషయం తెలిసిందే. గత వారం విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.409 బిలియన్ డాలర్లు తగ్గి 571.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. . పసిడి రిజర్వులు 192 మిలియన్ డాలర్లు పెరిగి 37.441 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.