శనివారం 28 మార్చి 2020
Business - Jan 13, 2020 , 00:36:58

ఎలాంటి అక్రమాలు జరుగలేదు

ఎలాంటి అక్రమాలు జరుగలేదు
  • రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌కు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ క్లీన్‌చిట్‌

న్యూఢిల్లీ, జనవరి 12: రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌లో మోసం, నిధుల మళ్లింపు తదితర ఎటువంటి అక్రమాలు జరుగలేదని ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌లో తేలింది. రుణదాతలు నిర్వహించిన ఈ ఆడిటింగ్‌.. సంస్థకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని ఆదివారం అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సంస్థకు రుణాలిచ్చిన రుణదాతలు.. రుణ తీర్మాన ప్రక్రియలో భాగంగా ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ కోసం గతేడాది ఆగస్టులో గ్రాంట్‌ థోంటన్‌ను నియమించారు. ఈ క్రమంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన గ్రాంట్‌ థోంటన్‌.. నిబంధనల ఉల్లంఘన, ఖాతాల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, నిధుల మళ్లింపు, మోసపూరిత లావాదేవీలు ఇలా ఎటువంటి అక్రమాలు జరుగలేదని తమ నివేదికలో పేర్కొన్నట్లు రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ తెలిపింది.

యాజమాన్య హక్కుల మార్పిడి కింద ఒత్తిడిలో ఉన్న ఆస్తుల తీర్మానానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ తప్పనిసరి. మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల నుంచి బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా సంస్థలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌కు నిధుల కొరత ఏర్పడింది. అధిక వడ్డీలకుగానీ అప్పు పుట్టని దుస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు సంస్థ ఆర్థిక స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.


logo