బుధవారం 03 జూన్ 2020
Business - Apr 13, 2020 , 00:21:48

ఒడిదుడుకుల్లోనే..

ఒడిదుడుకుల్లోనే..

  • ఈ వారం మార్కెట్‌ సరళిపై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: దేశీయ స్టాక్‌ మార్కె ట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయంటున్నారు. అయితే లాక్‌డౌన్‌ను పూర్తిగా కాకపోయినా స్వల్పంగా ఎత్తివేసినా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడే వీలుందనీ చెప్తున్నారు. స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలయ్యేందుకు అవకాశాలుండటమే ఇందుకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌ను పొడిగించడమే ఉత్తమమన్న ఏకాభిప్రాయం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుండగా, ఆర్థిక నష్టం దృష్ట్యా కొన్ని సడలింపులు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మదుపరులకు ధైర్యం రావచ్చని నిపుణులు అంటున్నారు. మంగళవారం అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని మార్కెట్లకు సెలవు.

రూ.9,103 కోట్లు వెనక్కి

కరోనా వైరస్‌ సంక్షోభం నేపథ్యంలో భారతీయ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐ ఈ నెలలో ఇప్పటిదాకా రూ.9,103 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 1-9 మధ్య స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.2,951 కోట్లు, రుణ మార్కెట్ల నుంచి రూ.6,152 కోట్లు తరలిపోయాయి. 

మెరిసిన ఆర్‌ఐఎల్‌

గత వారం ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నా యి. మొత్తం టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.4,04,068.05 కోట్లు పెరిగింది. ఆర్‌ఐఎల్‌ మదుపరుల సంపద అత్యధికంగా రూ.89,383.67 కోట్లు పెరిగి రూ.7,72,883.49 కోట్లను తాకింది. దీంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో అగ్ర సంస్థగా నిలబడింది. 


logo