సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 09, 2020 , 00:03:30

ఎఫ్‌పీఐలు యూటర్న్‌

ఎఫ్‌పీఐలు యూటర్న్‌

వరుసగా ఆరు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీగా నిధులు కుమ్మరించిన విదేశీ మదుపరులు ఒక్కసారిగా వెనక్కి తీసుకున్నారు. కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు పాకుతుండటంతో విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా ఈ నెల తొలి ఐదు ట్రేడింగ్‌ల్లోనే ఏకంగా రూ.13,157 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు ఎఫ్‌పీఐలు.  డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు మార్చి 2 నుంచి 6 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.8,997.46 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయిన ఎఫ్‌పీఐలు..డెబిట్‌ సెగ్మెంట్‌ నుంచి కూడా రూ.4,159.66 కోట్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా రూ.13,157.12 కోట్ల నిధులను తరలించుకుపోయారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి వరుసగా ఆరు నెలలుగా పెట్టుబడులకు మొగ్గుచూపిన ఎఫ్‌పీఐలు తాజాగా వెనక్కితగ్గారు. చైనాలో అల్లకల్లోలం సృష్టించిన కరోనా వైరస్‌ అమెరికాతోపాటు భారత్‌కు వ్యాపించడంతో అంతర్జాతీయ మార్కెట్లు పాతాళంలోకి పడిపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఈక్విటీల నుంచి ఉపసంహరించుకొని పసిడి వైపు మళ్లించారని గ్రోవ్‌ కో-ఫౌండర్‌, సీవోవో హర్ష జైన్‌ తెలిపారు. మరోవైపు ఆర్థిక మందగమన పరిస్థితులు వారిలో ఆందోళనను పెంచాయన్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వు అత్యవసరంగా అరశాతం వడ్డీరేట్లను తగ్గించడం, అలాగే దేశ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటం, యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభంతో ఇప్పట్లో పెట్టుబడులు పెరిగే అవకాశాలేమి కనిపించడం లేదన్నారు.   
logo