ముంబై, ఆగస్టు 20: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ మారకం నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తగ్గుముఖం పట్టడంతో గడిచిన వారాంతం నాటికి 619.365 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో ఉన్న 621.464 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 2.099 బిలియన్ డాలర్లు తక్కువ. మొత్తం రిజర్వుల్లో అత్యధికంగా ఉన్న విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.358 బిలియ్ డాలర్లు తరిగిపోయి 576.374 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీ విలువలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు పసిడి రిజర్వులు కూడా 720 మిలియన్ డాలర్లు తగ్గి 36.336 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.