శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Jan 21, 2020 , 01:37:02

ఘనంగా హల్వా వేడుక

ఘనంగా హల్వా వేడుక
  • పాల్గొన్న నిర్మలా సీతారామన్‌, ఉన్నతాధికారులు
  • బడ్జెట్‌ పత్రాల ముద్రణ మొదలు

న్యూఢిల్లీ, జనవరి 20:కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో హల్వా వేడుక ఘనంగా జరిగింది. సోమవారం నార్త్‌ బ్లాక్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఏటా బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభానికి సూచికగా ఈ హల్వా వేడుకను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రకటించనున్న సంగతి విదితమే. కాగా, బడ్జెట్‌ వివరాల గోపత్య కోసం ఎవరూ ఫిబ్రవరి 1దాకా ఆర్థిక మంత్రిత్వ శాఖను వీడరు. ‘బడ్జెట్‌ రహస్యాలను కాపాడటం కోసం బడ్జెట్‌ తయారీలో పాల్గొన్న వారందరినీ నార్త్‌ బ్లాక్‌లోనే ఉంచుతాం. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రకటన వరకు ఇంటికి వెళ్లరు. ఫోన్‌ కాల్స్‌, ఈ-మెయిల్స్‌ ఇతరత్రా అన్ని రకాల సమాచార వ్యవస్థలకూ వీరు దూరంగా ఉంటారు.’ అని ఓ ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే అతికొద్ది మంది సీనియర్‌ అధికారులకే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. బడ్జెట్‌ ముద్రణాలయం కూడా నార్త్‌ బ్లాక్‌లోనే ఉన్నది. ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌, రెవిన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అటాను చక్రవర్తి, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే, వ్యయ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.


logo