శనివారం 04 జూలై 2020
Business - Jul 01, 2020 , 00:34:09

ద్రవ్యలోటు పైపైకి

ద్రవ్యలోటు పైపైకి

 • రెండు నెలల్లోనే రూ.4.66 లక్షల కోట్లు
 • వార్షిక లక్ష్యంలో 58.6 శాతానికి సమానం

న్యూఢిల్లీ/ముంబై, జూన్‌ 30: కొవిడ్‌-19 సంక్షోభం దేశ ద్రవ్యలోటును అమాంతం పెంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2020-21) తొలి రెండు నెలల (ఏప్రిల్‌, మే)లోనే ఇది రూ.4.66 లక్షల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో నిర్దేశించుకొన్న లక్ష్యంలో ఇది 58.6 శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 52 శాతంగా ఉన్నట్టు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) మంగళవారం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును రూ.7.96 లక్షల కోట్లకు లేదా జీడీపీలో 3.5 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. కానీ కరోనా సంక్షోభం వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన నికర రాబడులు కేవలం రూ.33,650 కోట్లకు పరిమితమవడం, ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.5.12 లక్షల కోట్లకు చేరడంతో ద్రవ్యలోటు రూ.4,66,343 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌ నెలాఖరుకే ఇది జీడీపీలో 35.1 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతంగా ఉంటుందని అంచనా వేయగా.. చివరకు అది 4.6 శాతానికి పెరిగింది. 

రూ.94.62 లక్షల కోట్లకు పెరిగిన అప్పులు

ఈ ఏడాది మార్చి చివరి నాటికి ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.94,62,265 కోట్లకు పెరిగాయి. గతేడాది మార్చి నెలాఖరు నాటికి ఉన్న రూ.93,89,267 కోట్ల అప్పుల కంటే ఇవి 0.8 శాతం ఎక్కువని మంగళవారం విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కాగా, జనవరి-మార్చి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా మిగులు రూ.4,530 కోట్లుగా నమోదైనట్టు ఆర్బీఐ మంగళవారం వెల్లడించింది. ఇది జీడీపీలో 0.1 శాతానికి సమానమని తెలిపింది.

బ్యాంకులపై కరోనా పిడుగు


 • కోలుకోవడానికి ఏండ్లు పట్టవచ్చు: ఎస్‌అండ్‌పీ
 • ఈ ఏడాది 14 శాతానికి నిరర్ధక ఆస్తుల నిష్పత్తి
 • కరోనా వైరస్‌తో రిస్కులో పడిన రుణ వసూళ్లు

ముంబై, జూన్‌ 30: అంతా చక్కబడుతున్నదనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్‌ రూపంలో దేశీయ బ్యాంకింగ్‌ రంగంపై పిడుగు పడింది. ఈ మహమ్మారి దెబ్బకు యావత్‌ దేశం రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ మూతబడి ఆర్థిక వ్యవస్థే ఆగమాగమైంది. ఇప్పుడీ ప్రభావం బ్యాంకులపైనే కనిపిస్తుండగా, కరోనా కారణంగా వచ్చిపడిన కష్టాల నుంచి గట్టెక్కడానికి ఏండ్లు పట్టవచ్చని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ మంగళవారం అంచనా వేసింది. రుణాల పునర్‌వ్యవస్థీకరణతో సమస్యలను వాయిదా మాత్రమే వేసుకోగలమంటున్న ఎస్‌అండ్‌పీ.. మొండి బకాయిలు 14 శాతం వరకు పెరుగవచ్చని హెచ్చరించింది. నిజానికి 2018 మార్చిలో గరిష్ఠంగా 11.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) ఆ తర్వాతి కాలంలో తగ్గుతూ వచ్చాయి. కానీ ఆర్థిక మందగమన పరిస్థితులు ఇబ్బంది పెట్టాయి. ఇక కరోనా వైరస్‌ రాకతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినైట్లెంది. విమానయానం, హోటల్స్‌, మాల్స్‌, మల్టీప్లెక్సెస్‌, రెస్టారెంట్లు, రిటైల్‌ రంగాలు కరోనా పరిస్థితులతో భారీగా ఆదాయాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా ఎస్‌అండ్‌పీ గుర్తుచేసింది. 

కీలక రంగాలు కుదేలు


 • కరోనా దెబ్బకు స్తంభించిన ఉత్పత్తి
 • మే నెలలో మైనస్‌ 23.4 శాతానికి పతనం
 • 3 నెలలుగా మైనస్‌లో ఉత్పాదక రేటు

న్యూఢిల్లీ, జూన్‌ 30: మౌలిక రంగ పరిశ్రమలు కరోనా ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాయి. వరుసగా మూడో నెలా కీలక రంగాల ఉత్పాదక రేటు మైనస్‌లోనే నమోదైంది మరి. మే నెలలో మైనస్‌ 23.4 శాతానికి పతనమైంది. గతేడాది మే నెలలో 3.8 శాతం వృద్ధిరేటు ఉండటం గమనార్హం. అయితే ఏప్రిల్‌ నెలలో మైనస్‌ 37 శాతంగా ఉండగా, దీనితో పోల్చితే మాత్రం మే నెలలో కాస్త ప్రతికూల పరిస్థితులు చక్కబడ్డాయని అనుకోవచ్చు. ఎరువులు, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ రంగాల్లో ఎరువులు మినహా మిగతా రంగాలన్నింటిలో ప్రతికూల వృద్ధే ఉన్నదని వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. బొగ్గు 14 శాతం, సహజ వాయువు 16.8 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 21.3 శాతం, ఉక్కు 48.4 శాతం, సిమెంట్‌ 22.2 శాతం, విద్యుత్‌ రంగాల్లో 15.6 శాతం చొప్పున ప్రతికూల రేటు కనిపించింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం క్షీణత నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 4.5 శాతం వృద్ధిరేటు ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా రంగాల్లోని పరిశ్రమలు మూతబడ్డాయి.

మొండి బకాయిలు


 • 2019-20లో దేశంలోని బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 8.5%
 • 2020-21లో 14 శాతానికి పెరిగే అవకాశం
 • గడిచిన 18 నెలలుగా తగ్గుతూ వచ్చిన మొండి బకాయిలు
 • కరోనా వైరస్‌తో రిస్క్‌లో రుణాల వసూళ్లు
 • ఒత్తిడిలో నిర్మాణ, టెలికం, విద్యుత్‌ రంగాలు
 • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.40 వేల కోట్ల మూలధనం అవసరం

దడపుట్టిస్తున్న ద్రవ్యలోటు

 • 2020-21 ద్రవ్యలోటు అంచనా రూ.7.96 లక్షల కోట్లు
 • దేశ జీడీపీలో ఇది 3.5 శాతానికి సమానం
 • ఈ ఏడాది మే 31 నాటికి రూ.4,66,343 కోట్లకు చేరిక
 • బడ్జెట్‌ అంచనాలో ఇది 58.6 శాతం
 • ఏప్రిల్‌ 30 నాటికే 35.1 శాతాన్ని తాకిన ద్రవ్యలోటు
 • 2019-20 జీడీపీలో 4.6%గా నమోదు 
 • రెండు నెలల్లోనే రూ.4.66 లక్షల కోట్లు

  వార్షిక లక్ష్యంలో 58.6 శాతానికి సమానం


మౌలిక రంగం


 • 2019 మే నెలలో 3.8 శాతం వృద్ధి
 • ఈ ఏడాది మే నెలలో మైనస్‌ 23.4 శాతానికి ఉత్పాదక రేటు పతనం
 • ఏప్రిల్‌లో మైనస్‌ 37 శాతంగా నమోదైన ఉత్పత్తి
 • ఎరువులు మినహా అన్ని రంగాల్లో దిగజారిన తయారీ
 • 2020-21 ఏప్రిల్‌, మే నెలల్లో 30% క్షీణించిన మౌలిక రంగాల్లో ఉత్పత్తి
 • పారిశ్రామికోత్పత్తి సూచీలో కీలక రంగాల వాటా 40.27 శాతంబ్యాంకులపై పిడుగు


దడపుట్టిస్తున్న ద్రవ్యలోటుlogo