సోమవారం 30 మార్చి 2020
Business - Mar 11, 2020 , 00:31:59

విలీన బ్యాంకర్లతో రేపు నిర్మల భేటీ

విలీన బ్యాంకర్లతో రేపు నిర్మల భేటీ

న్యూఢిల్లీ, మార్చి 10: విలీనమైన బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రత్యేకంగా సమావేశంకాబోతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకిరానున్న ఈ విలీనం నేపథ్యంలో ఈ సమావేశం జరుగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ నెల మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఈ పది బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విలీనానికి సంబంధించి ఈ నెల 12న ఆర్థిక మంత్రి సమీక్షించనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విలీనం తర్వాత ఏర్పడనున్న బ్యాంకుల పనితీరు, సేవలు, ఖాతాదారుల ప్రయోజనాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఓబీసీ, యూబీఐలు పీఎన్‌బీలో విలీనమవనుండగా, కెనరా బ్యాంక్‌లోకి సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌లు కార్పొరేషన్‌ బ్యాంక్‌లోకి, అలహాబాద్‌ బ్యాంక్‌లోకి ఇండియన్‌ బ్యాంక్‌ విలీనంకాబోతున్నాయి. గతేడాది దేనా, విజయా బ్యాంకులను బీవోబీలోకి కలిపేసిన కేంద్రం..ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే. logo