ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 17, 2020 , 00:15:44

ఫియట్‌ జర్నీ

ఫియట్‌ జర్నీ

  • ఇటలీ  టు హైదరాబాద్‌

విదేశీ సంస్థలకు కేంద్రంగా మారుతున్నది మన భాగ్యనగరం.  అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు హైదరాబాద్‌కు క్యూ కట్టగా.. తాజాగా ప్రపంచ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన ఫియట్‌ క్రిస్లర్‌ ఇక్కడ గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ హబ్‌ ద్వారా వెయ్యి మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉత్తర అమెరికా వెలుపల ఫియట్‌ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద గ్లోబల్‌ సెంటర్‌ ఇదే.  వందేండ్ల క్రితం ఇటలీలో ప్రారంభమైన ఈఆటోమొబైల్‌ సంస్థ..అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ ఆటోమొబైల్‌ చరిత్రను తిరగరాసింది.

ఆటోమొబైల్‌ రంగంలో తనదైన ముద్రవేసిన ఫియట్‌.. 1899లో ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో మేటి సంస్థగా ఆవిర్భవించింది. సెకనుకు 3,856.10 డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఆటోమొబైల్‌ రంగంలో దిగ్గజ సంస్థలకు చెక్‌ పెడుతూ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా నూతన కార్లను రూపొందిస్తున్నది. దీంట్లోభాగంగా 2014లో క్రిస్లర్‌ను విలీనం చేసుకున్నది. రేసింగ్‌ కార్లు మొదలుకొని ఆధునిక ఎస్‌యూవీల వరకు ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది ఈ సంస్థే. ఏటా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు టెక్నాలజీ రంగాన్ని బలోపేతం చేసుకోవాలని కంకణం కట్టుకున్నది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లో అత్యాధునిక డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నది. కార్లతోపాటు విడిభాగాల తయారీలోనూ ఫియట్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మహారాష్ట్ర, తమిళనాడులో ప్రత్యేక యూనిట్లను నెలకొల్పింది.  ఆయా ప్రాంతాల్లో దాదాపు 3వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ రూపొందించిన మోడళ్ళలో ఒకటైన జీప్‌కు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండటంతో 13 దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నది. 2021లో మరిన్ని కొత్త మోడళ్లను ఇక్కడినుంచే తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది.

ఫియట్‌ క్రిస్లర్‌

ప్రారంభం: 1899

సీఈవో: మైకెల్‌ మ్యాన్లీ

ప్రధాన కార్యాలయం:  టురిన్‌ (ఇటలీ)

ఆదాయం: 10,800 కోట్ల యూరోలు(2019లో)

ఆస్తులు: 24.90 బిలియన్‌ యూరోలు

ఉద్యోగులు: 2 లక్షలకు పైగా(ప్రపంచవ్యాప్తంగా)

అనుబంధ సంస్థలు: క్రిస్లర్‌, ఫియట్‌, డాడ్జ్‌, అల్ఫా రోమియో, మాసేరాటి, లాన్సియా

విక్రయిస్తున్న వాహనాలు: 

అబర్త్‌, అల్ఫా రోమియో, క్రిస్లర్‌, డాడ్జ్‌, ఫియట్‌ ప్రొఫెషనల్‌, జీప్‌, లాన్షియా, ర్యామ్‌, ఎస్‌ఆర్‌టీ

VIDEOS

logo