శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Mar 01, 2020 , 23:44:11

లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
  • ఫిబ్రవరిలో రూ.1.05 లక్షల కోట్లుగా నమోదు
  • 12 శాతం పెరిగిన దేశీయ లావాదేవీల ఆదాయం

న్యూఢిల్లీ, మార్చి 1: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఆశాజనకంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది వరుసగా రెండో నెలా లక్ష కోట్ల రూపాయలను దాటాయి. ఫిబ్రవరిలో రూ.1,05,366 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చినట్లు ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. జనవరిలో రూ.1.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూైళ్లెన విషయం తెలిసిందే. ఇక ఈసారి గతేడాది ఫిబ్రవరితో పోల్చితే 8 శాతం ఆదాయం పెరిగింది. కాగా, జూలై 1, 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచి నెలసరి వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటడం ఇది 11వసారి. నిరుడు డిసెంబర్‌, నవంబర్‌ నెలల్లోనూ జీఎస్టీ ఆదాయం రూ.1.03 లక్షల కోట్ల చొప్పున నమోదైన సంగతి విదితమే. దీంతో వరుసగా నాలుగోసారి జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించినైట్లెంది. ఇదిలావుంటే ఫిబ్రవరి ఆదాయంలో సీజీఎస్టీ వాటా రూ.20,569 కోట్లుగా, ఎస్‌జీఎస్టీ రూ.27,348 కోట్లు, ఐజీఎస్టీ రూ.48,503 కోట్లు, సెస్సు రూ.8,947 కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి 29 నాటికి జనవరికిగాను దాఖలైన మొత్తం జీఎస్టీఆర్‌ 3బీ రిటర్నులు 83 లక్షలుగా నమోదైయ్యాయి. ఇక రెగ్యులర్‌ సెటిల్మెంట్‌గా ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.22,586 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ.16,553 కోట్లను కేంద్ర ప్రభుత్వం సెటిల్‌ చేసింది. ‘రెగ్యులర్‌ సెటిల్మెంట్‌ తర్వాత ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ఆదాయం సీజీఎస్టీగా రూ.43,155 కోట్లు, ఎస్‌జీఎస్టీగా రూ.43,901 కోట్లుగా ఉన్నది’ అని సదరు ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 


ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న నేపథ్యంలో ఫిబ్రవరి జీఎస్టీ ఆదాయంలో దేశీయ లావాదేవీల నుంచి వచ్చినది 12 శాతం పెరుగడం గమనార్హం. వస్తూత్పత్తుల దిగుమతి నుంచి వచ్చే ఆదాయం కూడా 8 శాతం పెరిగింది. ‘ఈ గణాంకాలు జీఎస్టీ వసూళ్లు స్థిరత్వాన్ని సంతరించుకున్నాయన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఈ-ఇన్వాయిసింగ్‌, కొత్త రిటర్నుల కోసం చేపట్టే నిర్ణయాలు భవిష్యత్తులో మరింత సుస్థిరతకు దోహదం చేస్తాయనిపిస్తున్నది’ అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఎంఎస్‌ మణి అన్నారు. మరోవైపు ఏప్రిల్‌ 1 నుంచి అన్ని బిజినెస్‌ టు కస్టమర్‌ (బీ2సీ) లావాదేవీల ఇన్వాయిస్‌ల కోసం ప్రతి నెలా లక్కీ డ్రాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం జీఎస్టీ కింద లాటరీ ఆఫర్‌ను ప్రారంభించాలని చూస్తున్నది. ప్రతీ కొనుగోలుకు కస్టమర్లు బిల్లులను తీసుకునేలా ఇది ప్రోత్సహించగలదని కేంద్రం ఆశిస్తున్నది. 

logo