మంగళవారం 26 మే 2020
Business - May 06, 2020 , 00:37:17

అమ్మో.. ఉద్యోగాలు పోతాయేమో

అమ్మో.. ఉద్యోగాలు పోతాయేమో

  • భారతీయులను పీడిస్తున్న భయాలు
  • 86% ఉద్యోగుల్లో దిగులు: సిటీ గ్రూప్‌
  • అన్ని రంగాలపై కరోనా ప్రభావం
  • వైరస్‌ కట్టడిలో సర్కార్‌పై విశ్వాసం

ముంబై, మే 5: లక్షల మంది ప్రాణాల్ని తోడేస్తున్న కరోనా వైరస్‌.. కోట్లాది మంది ఉద్యోగాలను, జీవనోపాధిని మింగేస్తున్నది. ఈ మహమ్మారి అంతానికి అన్ని దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తుండగా.. వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మెజారిటీ ఉద్యోగుల్లో తమ కొలువులు పోతాయేమోనన్న దిగులు కనిపిస్తున్నది. భారత్‌లో 86% మంది ఉద్యోగులకు జాబ్‌ లాస్‌ భయాలున్నాయి. సిటీ గ్రూప్‌ భారత్‌సహా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌ దేశాల్లో సర్వే చేపట్టింది. గత నెల 23-27 మధ్య జరిగిన సర్వేలో అత్యధికంగా 86% భారతీయులు తమ ఉద్యోగాలు, జీవనోపాధిపై ఆందోళన వ్యక్తం చేశారు. 71%తో హాంకాంగ్‌ రెండో స్థానంలో ఉండగా, అమెరికా (41%), ఆస్ట్రేలియా (33%), బ్రిటన్‌ (31%)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రభుత్వ చర్యలు భేష్‌

కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని దేశంలోని 84% మంది అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా 43%తో అట్టడుగు స్థానంలో ఉన్నది. భారత్‌ తర్వాత ఆస్ట్రేలియా (71%), బ్రిటన్‌ (56%), హాంకాంగ్‌ (53%) దేశాలున్నాయి. ఇక కరోనా నివారణకు అవలంభిస్తున్న చికిత్సా విధానం, వైద్య సదుపాయాలపై భారత్‌లో 68% మంది సంతృప్తిగా ఉన్నారు. బ్రిటన్‌లో ఇది మైనస్‌ 17%తో ఉండటం గమనార్హం. అమెరికాలో 3% మంది సంతృప్తికరంగా ఉంటే, ఆస్ట్రేలియాలో 60% మంది, హాంకాంగ్‌లో 22% మంది సంతృప్తిగా ఉన్నారు. ఇదిలావుంటే ఇంకా కరోనా ఆరంభ దశలోనే ఉందని 84% మంది విశ్వసిస్తున్నారు. అంతేగాక ఈ వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నదని నమ్ముతున్నారు.

తయారీ, మీడియా, ఐటీ వాళ్లలో..

తయారీ, మీడియా, ఐటీ రంగాల్లోని నిపుణుల్లో భవిష్యత్తుపై భరోసా లేదని లింక్డిన్‌ సర్వే వెల్లడించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉద్యోగ స్థిరత్వం, వృత్తిరిత్యా ప్రగతి అంశాల్లో విశ్వాసం సన్నగిల్లిందని పేర్కొన్నది. తయారీ రంగంలో ప్రతీ నలుగురిలో ఒకరికి, ఐటీ రంగంలో ప్రతీ ఐదుగురిలో దాదాపు ఇద్దరికి, మీడియా రంగంలో ఐదుగురిలో ముగ్గురికి తమ ఉద్యోగం, భవిష్యత్తుపై ఆందోళనలు కనిపిస్తున్నాయి. 


logo