15 అర్థరాత్రి నుంచి ఫాస్టాగ్ మస్ట్.. అదెలాగంటే..!

న్యూఢిల్లీ: మీరు సోమవారం అర్ధరాత్రి తర్వాత జాతీయ రహదారి మీదుగా వెళుతున్నారా? అయితే మీరు మీ వాహనానికి ఫాస్టాగ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ రూపంలో టోల్ ఫీజు చెల్లింపు విధానం అమలులోకి వస్తుంది. ఫాస్టాగ్ ఫెసిలిటీ లేని వాహనదారులు టోల్ ఫీజుకు రెట్టింపు చెల్లించాల్సిందేనని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక ఫాస్టాగ్ ఇన్స్టలేషన్ గడువును పొడిగించేదీ లేదని ఆదివారం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం స్పష్టం చేశారు. కనుక వాహనదారులంతా తక్షణం ఈ-పేమెంట్ ఫెసిలిటీని కొనుక్కోవాల్సిందేనని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై అన్ని టోల్గేట్లను ఈ నెల 15/16 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ లేన్లుగా ప్రకటిస్తున్నామని రవాణాశాఖ తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఫాస్టాగ్ విధానాన్ని డెవలప్ చేసింది. వాహనదారులంతా తమ కారు విండోషీల్డ్‌పై ఫాస్టాగ్ స్టిక్కర్‌ను అతికించుకోవాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. మీ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఆర్ఎఫ్ఐడీ బార్ కోడ్ లింక్ అవుతుంది. మీరు ఫాస్టాగ్ ఖాతాలో ప్రీపెయిడ్ బ్యాలెన్స్ జమ చేయాల్సి ఉంటుంది. టోల్ గేట్ల మీదుగా వెళ్లినప్పుడు ఆ బ్యాలెన్స్ నుంచి టోల్ ఫీజు విత్ డ్రాయల్స్ అవుతాయి. తద్వారా టోల్ గేట్ల వద్ద కార్లు ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఫాస్టాగ్ నంబర్ వెబ్‌సైట్‌ను పేటీఎం, అమెజాన్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంకుల వెబ్సైట్లతో అనుసంధానించారు.
మీ వెహికల్ టైప్‌ను బట్టి ఫాస్టాగ్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ కారు కోసం పేటీఎం ద్వారా రూ.500లతో ఫాస్టాగ్ కొనుగోలు చేస్తే.. అందులో రూ.250 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్, రూ.150 మీ వ్యాలెట్లోకి క్యాష్ బ్యాక్ అవుతుంది. ఫాస్టాగ్ డిజిటల్ వ్యాలెట్‌ను ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, యూపీఐ ద్వారా రీచార్జి చేసుకోవచ్చు.
ఫాస్టాగ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేండ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. తదుపరి వ్యాలిడిటీ పొడిగింపు ఉండదు. జడ్జిలు, మంత్రులు, చట్టసభల ప్రతినిధులు, టాప్ బ్యూరోక్రాట్లు, మిలిటరీ అధికారులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్లకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుంది. 2016లో అమలులోకి వచ్చిన ఫాస్టాగ్ గడువును ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు.. తాజాగా ఈ నెల 15 వరకు పొడిగించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.