మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 09, 2021 , 23:58:49

వాహ‌న ఓన‌ర్లూ! బీవేర్‌!.. ఫాస్టాగ్ గ‌డువు మ‌రో వార‌మే!!

వాహ‌న ఓన‌ర్లూ! బీవేర్‌!.. ఫాస్టాగ్ గ‌డువు మ‌రో వార‌మే!!

న్యూఢిల్లీ: కారు.. ట్ర‌క్కు.. బ‌స్సు ఏదైనా జాతీయ ర‌హ‌దారుల‌పై వెళ్లిన‌ప్పుడు టోల్ ఫీజు చెల్లించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌దు రూపేణా టోల్ ఫీజు చెల్లిస్తుండ‌టంతో పండుగ‌లు.. వివాహాల సీజ‌న్లలో టోల్ గేట్ల వ‌ద్ద వాహ‌నాలు బారులు తీర‌డం ఆన‌వాయితీగా మారుతోంది. దీనికితోడు డిజిట‌ల్ చెల్లింపులు వేగ‌వంతం చేయ‌డానికి టోల్ చెల్లింపులు డిజిట‌ల్ రూపంలో జ‌రుపాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

2017లోనే ఫాస్టాగ్ అమ‌లు మొద‌లైనా..

2017లోనే ఫాస్టాగ్ విధానం అమ‌లును ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచే త‌ప్ప‌నిస‌రి చేసింది. కానీ.. ప్ర‌జ‌ల, వాహ‌న‌దారుల సౌల‌భ్యం కోసం ఫాస్టాగ్ చెల్లింపుల అమ‌లును 45 రోజులు వాయిదా వేసింది కేంద్రం. దీని ప్ర‌కారం ఈ నెల 15 నుంచి వాహ‌న‌దారులంతా త‌ప్ప‌నిస‌రిగా  ఫాస్టాగ్‌ ద్వారానే టోల్ ఫీజు కట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ గతంలో ఓ ప్రకటనలో తెలిపింది.

ద్విచ‌క్ర వాహ‌నాలు మిన‌హా..

ద్విచక్రవాహనాలు మినహా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2017 డిసెంబర్‌ నుంచి కొత్తగా రోడ్డెక్కుతున్న ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల చట్టం 1989కి సవరణలు చేసింది. అంతకంటే ముందు విక్రయించిన వాహనాలకు 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరంటూ  గత ఏడాది నవంబ‌ర్ నెల‌లోనే కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. 

ఇప్ప‌టికైతే న‌గ‌దు చెల్లింపుల‌కు లైన్‌.. కానీ

ప్రస్తుతానికి టోల్‌ గేట్లలో నగదు చెల్లింపులు చేసే వాహనాల కోసం ప్రత్యేకంగా ఓ లైన్‌ కేటాయించారు. కానీ ఫిబ్రవరి 15 నుంచి దీన్ని కూడా ఉపసంహరిస్తారు. ఇక వాహ‌నాల య‌జ‌మానులు తప్పనిసరిగా డిజిటల్‌ చెల్లింపులు చేసే ముందుకు సాగాలి. వీటి ద్వారా టోల్‌గేట్ల నుంచి ప్రముఖులు ప్రయాణిస్తున్నా, పండగలైనా కిలోమీటర్ల మేర బారులు తీరే దుస్థితి తప్పుతుందని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. 

ఫాస్టాగ్ వ‌ల్ల ల‌భించే ప్ర‌యోజ‌నాలు ఇలా..

ఇంధనం, సమయం ఆదా అవుతాయని భరోసా క‌ల్పిస్తోంది. ఆధునిక టెక్నాల‌జీతో నిర్వహణ లోపాలు తప్పుతాయన్న‌ది. కానీ ఇప్పటికీ చాలా మంది వాహనదారులు ఫాస్టాగ్‌ తీసుకోకుండానే ప్రయాణం చేస్తున్నారు. అలాంటి వారి నుంచి రెండు రెట్లు టోల్‌ వసూలు చేస్తామని కేంద్రం రవాణా శాఖ ఇప్పటికే ప్రకటించింది.

30 వేల కేంద్రాల్లో ఫాస్టాగ్ విక్ర‌యాలు

అయితే ఫాస్టాగ్‌ను ఎక్కడ పొందాలనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియడం లేదు. దేశవ్యాప్తంగా 30వేల కేంద్రాల్లో ఫాస్టాగ్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద తప్పనిసరిగా ఇవి లభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్ష అమ్మకాలతో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి వాటిలో కూడా లభించేలా చర్యలు తీసుకున్నారు. 

27 బ్యాంకుల‌తో ఫాస్టాగ్ భాగ‌స్వామ్యం

ఫాస్టాగ్‌ చెల్లింపులు ఇప్పుడు ఇష్యూయర్‌ ఏజన్సీలుగా 27 బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక భారత్‌ పే పేమెంట్స్‌ సిస్టమ్‌, యూపీఐ, ఆన్‌లైన్‌ చెల్లింపులు, మై ఫాస్టాగ్‌ మొబైల్ యాప్‌, పేటీఎం, గూగుల్‌ పే తదితర పోర్టల్స్‌ ద్వారా కూడా రీఛార్జి చేసుకునే సదుపాయం కల్పించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం టోల్‌ప్లాజాల వద్ద పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ వద్ద నగదు రీఛార్జీ సౌకర్యం కూడా ఉంది. 

ఫాస్టాగ్‌తోపాటు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందే

ఫాస్టాగ్‌ ధర ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంటోంది. ఫాస్టాగ్‌ తీసుకోవాలనుకునేవారు ఛార్జీలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా చెల్లించాలి. ఉదాహరణకు.. ఐసీఐసీఐ బ్యాంక్‌లో తీసుకుంటే.. ట్యాగ్‌ ఫీజు రూ. 99.12, సెక్యూరిటీ డిపాజిట్‌ రూ. 200, కనీస బ్యాలెన్స్‌ రూ. 200తోపాటు రూ. 500 చెల్లించాలి. మిగతా బ్యాంకుల్లోనూ ఫాస్టాగ్ ధ‌ర‌ల్లో స్వల్ప తేడాలున్నాయి. ఒకసారి ఫాస్టాగ్‌ తీసుకుంటే ఐదేండ్ల‌ వరకు కాలపరిమితి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo