గురువారం 02 జూలై 2020
Business - May 31, 2020 , 00:03:01

లాక్‌డౌన్‌ పొడిగిస్తే మరింత చేటు తథ్యం: ఎస్బీఐ

లాక్‌డౌన్‌ పొడిగిస్తే మరింత చేటు తథ్యం: ఎస్బీఐ

న్యూఢిల్లీ, మే 30: భారత ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ఎంత త్వరగా అడ్డుకోవాలంటే లాక్‌డౌన్‌ నుంచి దేశం అంత త్వరగా బయటపడాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇందుకోసం ఎంతో తెలివైన వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నాలుగో విడుత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఎస్బీఐ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ను మరింత సాగదీస్తే వృద్ధిరేటు పతనాన్ని అడ్డుకోవడం మరింత ఆలస్యమవుతుందని శనివారం విడుదల చేసిన అధ్యయన నివేదిక ‘ఎకోవ్రాప్‌'లో ఎస్బీఐ హెచ్చరించింది. మాంద్యం నుంచి త్వరగా కోలుకోవడం తేలికకాదని, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఉన్నత స్థాయికి చేరేందుకు కనీసం ఐదు నుంచి పదేండ్ల సమయం పడుతుందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ఆదివారం విడుదలైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు గణాంకాలపై కూడా ఎస్బీఐ స్పందించింది. లాక్‌డౌన్‌ వల్ల మార్చి నెలాఖరులో జీడీపీ వృద్ధి క్షీణించిందని, అందుకే గత ఆర్థిక సంవత్సర (2019-20) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృద్ధిరేటు 3.1 శాతానికి దిగజారి 40 త్రైమాసికాల కనిష్ఠస్థాయికి పతనమైందని పేర్కొన్నది. దీని ఫలితంగానే గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతానికి దిగజారి 11 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయిందని ఎస్బీఐ అభిప్రాయపడింది.logo