శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 15, 2020 , 02:42:46

వృద్ధి జీరో శాతం!

వృద్ధి జీరో శాతం!

  • ఈ ఏడాది దేశ జీడీపీపై బార్క్‌లేస్‌ అంచనా
  • లాక్‌డౌన్‌ పొడిగింపుతో రూ. 18 లక్షల కోట్ల నష్టం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ లక్ష్యాలు, ఆశయాలను కరోనా వైరస్‌ ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఈ మహమ్మారి దెబ్బకు యావత్‌ భారతావని స్తంభించిపోయింది. 21 రోజుల లాక్‌డౌన్‌తో దేశ వృద్ధిరేటు అవకాశాలు ఏకంగా 3 దశాబ్దాల కనిష్ఠానికి పడిపోగా.. రూ.10 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. ఈ క్రమంలో కరోనా విజృంభణ దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరో 19 రోజులు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ నష్టాలు రూ.18 లక్షల కోట్లకు పెరగనున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా ఈ ఏడాది అసలు వృద్ధికి చోటే లేదంటున్నారు.

ముంబై, ఏప్రిల్‌ 14: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌ కలల్ని కల్లలు చేసింది. ఈ ఏడాది వృద్ధిరేటును మొత్తంగా మింగేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగింపుతో భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని బ్రిటన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ బార్క్‌లేస్‌ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అసలు వృద్ధికి తావులేదన్నది. సున్నాగా తేల్చేసింది. ఆర్థిక సంవత్సరం ఆధారంగా చూస్తే మాత్రం జీడీపీ 0.8 శాతంగా నమోదు కావచ్చని చెప్పింది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నిజానికి గత నెల 24న మొదలైన 21 రోజుల లాక్‌డౌన్‌ మంగళవారంతో ముగిసిపోయింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా ఈ లాక్‌డౌన్‌ను మరో 19 రోజులు పొడిగించారు. దీంతో ఇప్పటిదాకా ఉన్న నష్ట అంచనాలు రెట్టింపైయ్యాయి. మొదటి 21 రోజుల లాక్‌డౌన్‌లో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం రావచ్చన్న బార్క్‌లేస్‌.. పొడిగింపుతో దాదాపు రూ.18 లక్షల కోట్లుగా ఉండవచ్చని చెప్తున్నది. ఇక ఈ ఏడాది వృద్ధిరేటు ఉండదన్న బ్రోకరేజీ.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 0.8 శాతంగా అంచనా వేసింది. ఇంతకుముందు ఈ సంవత్సరం 2.5 శాతం వృద్ధిరేటుకు అవకాశాలున్నాయని బార్క్‌లేస్‌ తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ పొడిగింపుతో సున్నాకు చేర్చింది. అలాగే ఆర్థిక సంవత్సరం అంచనాలూ 3.5 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయాయి. లాక్‌డౌన్‌ పొడిగింపుతో దేశ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారవచ్చని, అందుకే తమ గత అంచనాలను పూర్తిగా మారుస్తున్నామని బార్క్‌లేస్‌ పేర్కొన్నది. తయారీ, వ్యవసాయ, గనుల రంగాలు అధికంగా ప్రభావితం అవుతున్నాయని వివరించింది.

ఈసారి 1.9 శాతం: ఐఎంఎఫ్‌

మరోవైపు ఈ ఏడాది దేశ జీడీపీ 1.9 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 1930 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని మంగళవారం తమ తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఈ సంవత్సరం జీడీపీ-3 శాతానికి పతనం కావచ్చన్నది.  భారత  వృద్ధిరేటుపైనా అధిక ప్రభావం ఉంటున్నదని వెల్లడించింది. 1991 తర్వాత అత్యంత కనిష్ఠ వృద్ధిరేటును భారత్‌ నమోదు చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది దేశ ఆర్థిక వృద్ధిరేటు 7.4 శాతానికి పెరుగవచ్చనడం గమనార్హం. ఇక చైనా జీడీపీలో 9.2 శాతం వృద్ధికి వీలుందన్న ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌.. 2021 ప్రపంచ వృద్ధిరేటును 5.8 శాతంగా అంచనా వేశారు.

అగ్రదేశాలు కుదేలు

కొవిడ్‌-19 కాటుకు అగ్ర దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ ఏడాది చిన్నాభిన్నమేనని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది. అమెరికాతోపాటు, చాలా ఐరోపా దేశాల్లో వృద్ధిరేటు మైనస్‌ స్థాయిల్లో ఉండొచ్చని అంచనా వేసింది. సౌదీ అరేబియా, మిడిల్‌ ఈస్ట్‌, సెంట్రల్‌ ఆసియా, థాయిలాండ్‌, ఇరాన్‌ దేశాల జీడీపీ కూడా మైనస్‌ల్లో ఉండే వీలుందని వెల్లడించింది.


logo