ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 03, 2021 , 01:05:05

ఎగుమతులు డౌన్‌

ఎగుమతులు డౌన్‌

  • డిసెంబర్‌లో 0.8 శాతం తగ్గుదల
  • 7.6 శాతం పెరిగిన దిగుమతులు
  • రూ.1,14,827 కోట్ల వాణిజ్యలోటు

న్యూఢిల్లీ, జనవరి 2: దేశ ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. డిసెంబర్‌లో స్వల్పంగా 0.8 శాతం క్షీణించి రూ.1,96,545 కోట్లకు పరిమితమయ్యాయి. పెట్రోలియం, లెదర్‌ (తోలు), మెరైన్‌ (సముద్ర) ఉత్పత్తుల్లో క్షీణత నమోదవడమే ఎగుమతుల తగ్గుదలకు కారణమని శనివారం కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 7.6 శాతం పెరిగి రూ.3,11,372 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి తర్వాత సానుకూల వృద్ధి రేటు నమోదవడం ఇదే తొలిసారి. కాగా, డిసెంబర్‌లో ఎగుమతుల క్షీణత వల్ల వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా) 25.78 శాతం పెరిగి రూ.1,14,827 కోట్లకు ఎగబాకింది. 2020లో జూలై తర్వాత ఇదే అత్యధిక వాణిజ్య లోటు. 2019 డిసెంబర్‌లో దేశ ఎగుమతులు రూ.1,98,153 కోట్లు)గా.. దిగుమతులు రూ.2,88, 714 కోట్లుగా నమోదయ్యాయి. కానీ 2020 నవంబర్‌లో ఎగుమతులు 8.74 శాతం పడిపోయాయి. మొత్తంగా 2020 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో ఎగుమతులు 15.8 శాతం క్షీణించి రూ.14,65,865 కోట్లకు పరిమితమయ్యాయి. అలాగే దిగుమతులు 29.08 శాతం క్షీణించి రూ.18,95,208 కోట్లకు చేరాయి. డిసెంబర్‌లో చమురు దిగుమతులు 10.37 శాతం తగ్గి రూ.70,241 కోట్లకు చేరాయి. ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో చమురు దిగుమతులు 44.46 శాతం క్షీణించి రూ.3,92,578 కోట్లకు పరిమితమైనట్లు వాణిజ్య శాఖ వివరించింది. 

ఎగుమతుల తీరు

ఎగుమతుల్లో ఆయిల్‌ మీల్స్‌ అత్యధికంగా 192.60 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే ఇనుప ధాతువు (69.26%), కార్పెట్‌ (21.12%), ఫార్మాస్యూటికల్స్‌ (17.44%), సుగంధ ద్రవ్యాలు (17.06%), ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ (16.44%), పండ్లు-కూరగాయలు (12.82%), రసాయనాలు (10.73%), చేనేత ఉత్పత్తులు (10.09%), బియ్యం (8.60%), మాంసం-డైరీ-పౌల్ట్రీ ఉత్పత్తులు (6.79%), రత్నాభరణాల (6.75%) ఎగుమతుల్లో కూడా సానుకూల వృద్ధి రేటు నమోదైంది. పెట్రోలియం ఎగుమతుల్లో మైనస్‌ 40.47 శాతం ప్రతికూల వృద్ధి రేటు నమోదైంది. నూనె గింజలు (-31.80%), లెదర్‌ (-17.74%), కాఫీ (-16.39%), రెడీమేడ్‌ దుస్తులు (-15.07%), చేతితో తయారు చేసిన నూలు/వస్ర్తాలు (-14.61%), మెరైన్‌ ఉత్పత్తులు (-14.27%), జీడిపప్పు (-12.04%), పొగాకు (-4.95%) ఎగుమతుల్లో కూడా ప్రతికూల వృద్ధి రేటు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.

దిగుమతుల తీరు

దిగుమతుల్లో పప్పుధాన్యాలు అత్యధికంగా  245.15 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. బంగారం (81.82%), వెజిటబుల్‌ ఆయిల్‌ (43.50%), రసాయనాలు (23.30%), ఎలక్ట్రానిక్‌ వస్తువులు (20.90%), మెషీన్‌ టూల్స్‌ (13.46%), ముత్యాలు-రత్నాలు (7.81%), ఎరువుల (1.42%) దిగుమతుల్లో కూడా సానుకూల వృద్ధి రేటు నమోదైంది.


VIDEOS

logo