శనివారం 30 మే 2020
Business - Feb 15, 2020 , 00:16:25

ఎగుమతుల్లో నీరసం

ఎగుమతుల్లో నీరసం
  • జనవరిలో 1.66 శాతం క్షీణత.. వరుసగా ఆరో నెలలో తగ్గుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. పెట్రోలియం, ప్లాస్టిక్‌, కార్పెట్లు, జెమ్స్‌ అండ్‌ జ్యూవెల్లరీ, చర్మ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ పడిపోవడంతో జనవరి నెలకుగాను ఎగుమతులు 1.66 శాతం తగ్గి 25.97 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. వరుసగా ఎనిమిది నెలలుగా తగ్గుతూ వచ్చిన దిగుమతులు కూడా 0.75 శాతం తగ్గి 41.41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయినప్పటికీ వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఏడు నెలల గరిష్ఠ స్థాయి 15.17 బిలియన్‌ డాలర్లను తాకింది. క్రితం ఏడాది ఇదే నెలలో లోటు 15.05 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. జూన్‌ 2019లో నమోదైన 15.28 బిలియన్‌ డాలర్లు ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. 30 కీలక రంగాల్లో 18 రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోగా..కేవలం 12 మాత్రం ఆశాజనక పనితీరు కనబరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జనవరి మధ్యకాలానికిగాను ఎగుమతులు 1.93 శాతం తగ్గి 265.26 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, ఇదే సమయంలో దిగుమతులు 8.12 శాతం తగ్గి 398.53 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. దీంతో వాణిజ్య లోటు 133.27 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 


భారీగా తగ్గిన పసిడి దిగుమతులు

పసిడి దిగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏడాది ప్రాతిపదికన గత నెలలోనూ తొమ్మిది శాతం తగ్గి 1.58 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత నెలలో పెట్రోలియం ప్రొడక్ట్‌ 7.42 శాతం పడిపోగా, ప్లాస్టిక్‌ 10.62 శాతం, కార్పెట్లు 5.19 శాతం, జెమ్స్‌ అండ్‌ జ్యూవెల్లరీ 6.89 శాతం, చర్మ ఉత్పత్తులు 7.54 శాతం చొప్పున పడిపోయాయి. దేశ వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పడిపోగా, పారిశ్రామిక వృద్ధి 0.3 శాతం తగ్గాయి. గత నెలలో చమురు దిగుమతులు 15.27 శాతం పెరిగి 12.97 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా, చమురేతర ఉత్పత్తుల దిగుమతులు 6.72 శాతం తగ్గి 28.17 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యవసరంగా ఎగుమతులు పెరుగాలంటే టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఉన్నదని ఏఈపీసీ చైర్మన్‌ ఏ శక్తివేల్‌ తెలిపారు.


logo