శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 12, 2021 , 21:25:41

విమాన టికెట్ల ధ‌ర‌ల పెంపు అందుకేనా?!

విమాన టికెట్ల ధ‌ర‌ల పెంపు అందుకేనా?!

న్యూఢిల్లీ: విమాన ప్ర‌యాణ టికెట్ల ధ‌ర 30 శాతం పెంచ‌డం వెనుక హేతుబ‌ద్ధ కార‌ణాలేమిటో ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు. అయితే విమాన‌యాన శాఖ అధికారులు మాత్రం పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల నుంచి ఎయిర్‌లైన్స్‌కు రిలీఫ్ క‌ల్పించ‌డానికే టికెట్ల ధ‌ర‌లు పెంచామ‌ని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి కిలో లీట‌ర్ ఏవియేష‌న్ ట‌ర్బైన్ ఫ్యూయ‌ల్ ధ‌ర రూ.53,795.41కి పెరిగింది. ఇది గ‌త నెల‌తో పోలిస్తే ఆరు శాతం ఎక్కువ‌. క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డానికి గ‌తేడాది మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత దేశీయంగా విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు అనుమ‌తించిన త‌ర్వాత కేంద్రం విమాన టికెట్ల ధ‌ర‌లు పెంచ‌డం ఇదే తొలిసారి. 

డిమాండ్‌ను బ‌ట్టి విమాన టికెట్ల ధ‌ర‌లు..

టికెట్ల ధ‌ర‌లు 30 శాతం పెంచినా కొన్ని బేసిక్ రూట్ల‌లో డిమాండ్‌ను బ‌ట్టే వాటి ధ‌ర‌లు ఖ‌రార‌వుతాయి. ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాతే గ‌త నెల‌లో మీడియ‌న్ ఫేర్ కంటే త‌క్కువ ధ‌ర ఉన్న ప్ర‌యాణ టిక్కెట్ల ధ‌ర‌లు 20 శాతం పెంచ‌డానికి కేంద్రం అనుమ‌తినిచ్చింది. దీని ప్ర‌కారం మీడియ‌న్ ఫేర్ టికెట్లు 40 శాతం వ‌ర‌కు ఎయిర్‌లైన్స్ విక్ర‌యించుకోవ‌చ్చు. డిమాండ్ ఎక్కువ‌గా ఉంటే టికెట్ల ధ‌ర మ‌రింత ప్రియం అ‌వుతుంది. ఈ ధ‌ర‌ల పెంపు వ‌చ్చేనెల 31 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది. త‌దుప‌రి మార్కెట్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కేంద్రం నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. 

టికెట్ల ధ‌ర‌ల‌పై ప‌రిమితులు ఇలా..

గ‌తేడాది మే నెల‌లో దేశీయ విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు ప‌చ్చ జెండా ఊపిన కేంద్రం.. క‌నిష్ఠ‌, గ‌రిష్ట టికెట్ల ధ‌ర‌ల‌పై ప‌రిమితులు విధించింది. విమానాల ప్ర‌యాణ స‌మ‌యాన్ని బ‌ట్టి సెవెన్ బాండ్లుగా టికెట్ల‌ను ఖ‌రారు చేసింది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే విమానాల టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉంటే ప్ర‌యాణికులు భ‌రించ‌లేర‌ని కేంద్రం పేర్కొంది. మ‌రోవైపు క‌నిష్ట టికెట్ ధ‌ర‌లు గ‌ల మార్గాల్లో ఎయిర్‌లైన్స్ మ‌ధ్య టారిఫ్ యుద్ధాల‌ను నివారించ‌డానికి ప‌రిమితి విధించామ‌ని తెలిపింది. ఈ టారిఫ్ వార్స్‌ను అనుమ‌తినిస్తే విమాన‌యాన రంగంలో సంస్థ‌లు దివాళా తీసే ప‌రిస్థితికి దారి తీస్తుంద‌ని కేంద్రం సంకేతాలిచ్చింది. 

ఇవీ న్యూ ఫేర్ ప‌రిమితులు

తొలి బాండ్ విమానాల ప్ర‌యాణ స‌మ‌యం 40 నిమిషాల్లోపే.. దాని టికెట్ ధ‌ర రూ.2000 నుంచి రూ.2,200కి పెంపు.

అప్ప‌ర్ లిమిట్ బాండ్ ప్ర‌యాణ టికెట్ ధ‌ర రూ.6000 నుంచి రూ.7,800కు పెంపు

విమానాల బాండ్ ప్ర‌యాణ స‌మ‌యాలు 40-60 నిమిషాలు, 60-90, 90-120, 120-150, 150-180 నిమిషాలుగా నిర్ణ‌యించారు. 

గురువారం ఖ‌రారు చేసిన తాజా క‌నిష్ట‌, గ‌రిష్ట ప్ర‌యాణ టికెట్ ధ‌ర‌లు రూ. 2,800-రూ. 9,800; రూ. 3,300-రూ.  11,700; రూ.  3,900-రూ.  13,000; రూ. 5,000-రూ. 16,900; రూ. 6,100-రూ. 20,400; రూ. 7,200-రూ. 24,200గా నిర్ణ‌యించింది కేంద్రం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo