బుధవారం 27 మే 2020
Business - May 12, 2020 , 00:06:29

2-3 రోజుల్లో ఉద్దీపన

2-3 రోజుల్లో ఉద్దీపన

తెలంగాణ పరిశ్రమపెద్దలతో గడ్కరీ

న్యూఢిల్లీ, మే 11: కేంద్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే వీలుందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. తెలంగాణ పారిశ్రామిక పెద్దలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రుణాలపై ఆర్బీఐ 3 నెలల మారటోరియం ఇచ్చినా పరిస్థితులు దారుణంగానే ఉన్నాయని ఈ సందర్భంగా గడ్కరీ వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న ఆయన.. అందరినీ రక్షించే దిశగానే సర్కారు ముందుకెళ్తున్నట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రధాని మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకొస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.

రూ.4.5 లక్షల కోట్లు కావాలి: ఫిక్కీ


కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అత్యవసర సాయం అవసరమని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అభిప్రాయపడింది. రూ.4.5 లక్షల కోట్ల అదనపు ఆర్థిక మద్దతు కావాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి తెలిపారు. రిఫండ్స్‌, ప్రభుత్వ చెల్లింపుల్లో నిలిచిపోయిన రూ.2.5 లక్షల కోట్లనూ తక్షణమే విడుదల చేయాలని కోరారు. లాక్‌డౌన్‌తో చితికిపోయిన సంస్థలకు బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించాలని, బ్యాంకర్లకు ప్రభుత్వమే హామీ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలని, నిర్మాణ రంగానికీ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.logo