బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 25, 2020 , 00:48:19

ఆర్థిక ప్రగతికి ఆరు మార్గాలు

ఆర్థిక ప్రగతికి ఆరు మార్గాలు

న్యూఢిల్లీ, జనవరి 24: ఆర్థిక మందగమనం, మితిమీరిన ద్రవ్యోల్బణాల మధ్య వస్తున్న రాబోయే బడ్జెట్‌లో జీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పడకేసిన ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు మెజారిటీ నిపుణులు ఆరు మార్గాలను సూచించారు. అవి..

  • బడ్జెట్‌కు నిపుణుల సూచనలు

నిర్దేశిత లక్ష్యాలు వద్దు

దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంచనాలకు మించి ప్రమాదకరంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ముందు వృద్ధిరేటు బలోపేతంపైనే దృష్టి పెట్టాలని, నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలు తగవని సూచిస్తున్నారు. బడ్జెట్‌ అంచనాలను సాధించాలని వృద్ధిదాయక చర్యలకు విఘా తం కలిగించరాదని కోరుతున్నారు. గాడి తప్పిన జీడీపీ పట్టాలపైకి ఎక్కేంత వరకు కాస్త పట్టువిడుపులుండటం మంచిదని చెబుతున్నారు.


ఆదాయం పన్ను తగ్గించాలి

కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన నేపథ్యంలో ఆదాయం పన్ను (ఐటీ)నూ తగ్గిస్తే మంచిదని, దీనివల్ల వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరుగుతుందని మెజారిటీ నిపుణులు విశ్వసిస్తున్నారు. డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోడ్‌పై అఖిలేష్‌ రంజన్‌ కమిటీ నివేదికను ప్రభు త్వం అమలు పరుచాలని, ట్యాక్స్‌ శ్లా బులను మార్చాలని సూచిస్తున్నారు. 


రుణాల పంపిణీ పెరుగాలి

మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధతను తొలగించేందుకు వ్యాపార, పారిశ్రామిక రంగాలకు రుణాల మంజూరును పెంచాలని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల సంక్షోభం దృష్ట్యా రుణ వితరణ పెంపు అనివార్యమని అభిప్రాయపడుతున్నారు. ఎన్‌బీఎఫ్‌సీలకూ చేయూత అవసరమంటున్నారు.


నిధుల సమీకరణ ముఖ్యం 

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వేగాన్ని పెంచాలని, ఖజానాకు నిధుల ప్రవాహం పెరుగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, కాంకర్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌లలో వాటాల విక్రయాన్ని కేంద్ర ప్రభు త్వం పూర్తి చేయాలని చూస్తున్నది. 


ఎల్టీసీజీ, డీడీటీ రద్దు

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ), డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)లను తగ్గించాలని, దీనివల్ల దేశీయ స్టాక్‌ మార్కెట్లకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మదుపరుల నుంచి దేశ, విదేశీ పెట్టుబడులు పెరుగుతాయంటున్నారు. 


మౌలిక రంగానికి పెద్దపీట

మౌలిక రంగానికి పెద్దపీట వేయాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని సూచిస్తున్నారు. ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్‌లకు మరిన్ని నిధులు ఇవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


logo