గురువారం 04 జూన్ 2020
Business - Mar 29, 2020 , 23:59:28

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో ఆసరా

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో ఆసరా

-నిల్వలో కొంత మొత్తం ఉపసంహరణకు వెసులుబాటు

న్యూఢిల్లీ, మార్చి 29: కరోనా వైరస్‌ను ప్రతిఘటించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ఖర్చుల కోసం ఈపీఎఫ్‌ చందాదారులు తమ సొమ్ములో కొంత మొత్తాన్ని ఉపసంహరించుకొనేందుకు (విత్‌డ్రా చేసుకొనేందుకు) ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) అనుమతిచ్చింది. అంతేకాకుండా కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వివరాలను సమర్పించిన చందాదారులు ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఈపీఎఫ్‌వో సిబ్బంది ప్రమేయం లేకుండా నగదును ఉపసంహరించుకొనేందుకు ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఉద్యోగ భవిష్యనిధి పథకం-1952ను సవరించేందుకు శనివారం (మార్చి 28న) నోటిఫికేషన్‌ జారీచేసినట్టు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నామని, ఈపీఎఫ్‌ ఖాతా నుంచి చందాదారులు మూడునెలల మూలవేతనంతోపాటు కరవుభత్యాన్ని లేదా కనీస నిల్వ నుంచి 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని కార్మికశాఖ వివరించింది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తూ ఈపీఎఫ్‌ పథకం-1952లో సభ్యులుగా ఉన్న ఉద్యోగులంతా ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులని తెలిపింది. ఇందుకోసం ఈపీఎఫ్‌ పథకం-1952లోని పేరా 68ఎల్‌లో సబ్‌పేరా (3)ని చేర్చింది. సవరించిన ఈపీఎఫ్‌ పథకాన్ని శనివారం (మార్చి 20) నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నగదు ఉపసంహరణ కోసం చందాదారుల నుంచి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి వారికి చేయూతనివ్వాలని క్షేత్రస్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేవాలు జారీచేసింది. 


logo