మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jun 26, 2020 , 23:56:19

పీఎఫ్‌ వడ్డీరేటు కోత?

పీఎఫ్‌ వడ్డీరేటు కోత?

న్యూఢిల్లీ, జూన్‌ 26: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) గత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వడ్డీరేటును 0.4 శాతం తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తమ దగ్గరున్న ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులపై 8.5 శాతం వడ్డీరేటును ఈపీఎఫ్‌వో చెల్లిస్తున్నది. అయితే దీన్ని 8.1 శాతానికి కుదించే వీలున్నట్లు ఓ ప్రముఖ జాతీయ వార్తా చానల్‌ సమాచారం. ఈ మేరకు ఫైనాన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ (ఎఫ్‌ఐఏసీ) సమావేశమై వడ్డీరేటుపై ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తున్నది. నిజానికి ఈ ఏడాది మార్చిలో 2019-20కిగాను పీఎఫ్‌ వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించారు. అయితే దీనికి ఇంకా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం రాలేదు. ఈ నేపథ్యంలో 8.1 శాతానికి తగ్గవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే 6 కోట్లకుపైగా ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తమ నిధులపై మరింత తక్కువ ప్రయోజనం దక్కనున్నది. 2018-19కు 8.65 శాతం వడ్డీరేటును చెల్లించారు. కాగా, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాల ఆదాయాన్ని కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లు పెద్ద ఎత్తున ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. కనీస వేతనంలో పీఎఫ్‌ వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో తగ్గించిన సంగతీ విదితమే. మరోవైపు కొవిడ్‌-19 నేపథ్యంలో ఈపీఎఫ్‌వో నుంచి భారీగా పెరిగిన నగదు ఉపసంహరణలూ వడ్డీరేటు కోతకు దారితీస్తున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో రూ. 11,540 కోట్ల నగదు ఉపసంహరణలు జరుగగా, రూ.4,580 కోట్లు కరోనా అడ్వాన్సులే కావడం గమనార్హం. 

వడ్డీని తగ్గించొద్దు: ఏఐటీయూసీ

ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీరేటును తగ్గించాలన్న యోచనను ఏఐటీయూసీ  వ్యతిరేకించింది. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ సమయంలో వడ్డీరేటు కోత సరికాదన్నది. 


logo