భారత్‌లోకి మస్క్ రాక లాభమే:బెంజ్

న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి అమెరికా విద్యుత్ కార్ల జెయింట్ టెస్లా రంగ ప్రవేశం చేసినా తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశీయ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ స్పష్టం చేసింది. ఆటోమొబైల్ రంగంలోకి మరో బ్రాండ్ రావడంతో దేశీయంగా ప్రీమియం గ్రీన్ కార్ల వాడకం మరింత బలోపేతం అవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా అధిపతి మార్టిన్ స్కూవెన్ పేర్కొన్నారు. భారత్‌లో తమ మార్కెట్ సమర్థవంతంగా ఉందని, ఎలన్‌మస్క్ సారధ్యంలోని విద్యుత్ వాహనాల కార్ల తయారీ సంస్థ టెస్లా రావడం వల్ల తమకు ఎటువంటి ముప్పు లేదన్నారు. గత కొన్నేండ్లుగా ఎలన్‌మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జోరుగా పెరుగుతోంది.
చైనా, యూరప్‌ల్లో బెంజ్‌కు టెస్లా నుంచి పోటీ
భారత్ పొరుగుదేశమైన చైనాతోపాటు, అమెరికా, యూరప్‌లోని పలు దేశాల్లో మెర్సిడెస్ బెంజ్ కార్లకు టెస్లా గట్టి పోటీనిస్తున్నది. నూతన బ్రాండ్ మార్కెట్లోకి రావడం వల్ల కార్ల వినియోగదారుల్లో అదనపు ఆసక్తి, అదనపు మార్కెట్ పెరుగుతుందని మార్టిన్ స్కూవెన్ అభిప్రాయ పడ్డారు. తాము టెస్లాతో మాత్రమే పోటీ పడటం లేదని చెప్పారు. బెంగళూరులోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద.. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట టెస్లా కంపెనీ పేరు రిజిస్టర్ చేసుకున్నది.
టెస్లా ఎంట్రీపై గడ్కరీ సంకేతాలు
2021లో భారత మార్కెట్లో టెస్లా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని 2020 డిసెంబర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. మోడల్-3 కారుతో భారత విపణిలోకి అడుగు పెట్టనున్న టెస్లా.. దానికి గల డిమాండ్‌ను బట్టి దేశీయంగా ఉత్పాదక యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది. దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యం, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ముడి చమురు దిగుమతి సుంకం భారం నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్.. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది. సంప్రదాయ కార్ల స్థానే గ్రీన్ కార్లను కొనుగోలు చేసే విక్రేతలకు పలు రాయితీలు అమలు చేస్తున్నది.
విద్యుత్ కార్లు కొంటే కేవలం 5శాతం జీఎస్టీ
విద్యుతేతర కార్లపై 28 శాతానికి పైగా జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. విద్యుత్ వాహనాల కొనుగోలుపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించి వేసింది. విద్యుత్ కార్లు, బైకులు, స్కూటర్లను కొనుగోలు చేసిన వారికి కొనుగోలు సబ్సిడీలు, ఆదాయం పన్నుశాఖ సబ్సిడీలు కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశీయంగా విద్యుత్ వాహనాల ఉత్పత్తికి యూనిట్లు ఏర్పాటు చేసే వరకు విదేశాల నుంచి కార్లు, ఇతర వాహనాల దిగుమతికి అనుమతినిస్తోంది మోదీ సర్కార్. దేశీయ ఆటోమొబైల్ సంస్థలతో టై-అప్ కోసం టెస్లా ప్రయత్నిస్తున్నది. అయితే, టెస్లా తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పినట్లు వచ్చిన వార్తలను టాటా మోటార్స్ ఖండించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.