గురువారం 28 మే 2020
Business - May 14, 2020 , 01:31:01

పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గింపు

పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గింపు

  • ఉద్యోగులు, కంపెనీల వాటా 10 శాతానికి కుదింపు
  • మూడు నెలలపాటు చెల్లించనున్న కేంద్రం 
  • ఐటీ రిటర్నుల గడువు నవంబర్‌ 30కి పొడిగింపు
  • టీడీఎస్‌/టీసీఎస్‌ రేట్లు 25 శాతం తగ్గింపు

న్యూఢిల్లీ, మే 13: వచ్చే మూడు నెలలపాటు ఉద్యోగుల, కంపెనీల ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రకటించారు. ‘ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో)’ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకూ ఇది వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల 6.5 లక్షల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని, వచ్చే మూడు నెలల్లో వాటికి దాదాపు రూ.6,750 కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులో వస్తుందని మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ 12 శాతం చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు మాత్రం 10 శాతమే చెల్లించాలని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద చిన్న కంపెనీలకు ప్రకటించిన పీఎఫ్‌ సంబంధిత ప్రయోజనాలను మరో మూడు నెలలపాటు పొడిగించారు. ఇందులో భాగంగా 100 మంది వరకు ఉద్యోగులు (90 శాతంమంది ఉద్యోగులకు రూ.15,000 కంటే తక్కువ వేతనం ఉండాలి) కలిగిన సంస్థలు, ఉద్యోగుల తరఫున కేంద్రమే పీఎఫ్‌ చెల్లిస్తుంది. 

పన్ను చెల్లింపుదారులకు ఊరట

పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్‌ ఊరట కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు గడువును నవంబర్‌ 30 వరకు పొడిగించారు. అలాగే టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లను 25 శాతం తగ్గించారు. వేతనేతర చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. ‘గురువారం నుంచి 2021 మార్చి 31 వరకు ప్రస్తుతమున్న టీడీఎస్‌/టీసీఎస్‌ రేట్లను 25 శాతం తగ్గిస్తున్నాం. కాంట్రాక్టులు, వడ్డీ, అద్దె, డివిడెండ్‌, కమిషన్‌ లేదా బ్రోకరేజీ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీని వల్ల ప్రజలకు రూ.50,000 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు. ట్యాక్స్‌ ఆడిట్‌ గడువును అక్టోబర్‌ 31వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌ 30తో గడువు మీరనున్న మదింపు కాలాన్ని (అసెస్‌మెంట్స్‌) ఈ ఏడాది 31 వరకు, వచ్చే ఏడాది మార్చితో గడువు మీరనున్న మదింపు కాలాన్ని అదే ఏడాది సెప్టెంబర్‌ 30వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. 

టీడీఎస్‌, టీసీఎస్‌ను 25 శాతం తగ్గించడం వల్ల విక్రేతల చేతుల్లో  అదనంగా నగదు మిగులుతుంది. వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది.

- సందీప్‌ ఝున్‌ఝున్‌వాలా, నాంజియా అండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ 


logo