ఆదివారం 05 జూలై 2020
Business - May 28, 2020 , 00:36:43

కెరియర్‌ కోసం కసరత్తు

కెరియర్‌ కోసం కసరత్తు

  • లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటున్న ఉద్యోగార్థులు
  • నైపుణ్యాన్ని పెంచుకొనే దిశగా కీలక అడుగులు
  • నౌకరీడాట్‌కామ్‌ సర్వేలో వెల్లడి

ముంబై, మే 27: లాక్‌డౌన్‌ సమయాన్ని తమ నైపుణ్యం పెంచుకొనేందుకు ఉపయోగించుకుంటున్నారు ఉద్యోగార్థులు. కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారిలో దాదాపు సగం మంది అత్యుత్తమ కెరియర్‌ కోసం ఈ లాక్‌డౌన్‌లో కష్టపడుతున్నారు. మరిన్ని మంచి అవకాశాలను అందుకోవాలని తపిస్తున్నారు. జాబ్‌ పోర్టల్‌ నౌకరీడాట్‌కామ్‌ నిర్వహించిన సర్వేలో తమలో నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు ఈ లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకొంటున్నట్లు సుమారు 50 శాతం మంది స్పష్టం చేశారు. లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టినట్లు వారు చెప్పారని నౌకరీడాట్‌కామ్‌ తెలిపింది. డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ కోర్సులు (22 శాతం), డిజిటల్‌ మార్కెటింగ్‌ (20 శాతం), ఫైనాన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (16 శాతం)లను మెజారిటీ ఉద్యోగార్థులు ఎంచుకుని సాధన చేస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 31దాకా ఇది కొనసాగనున్న సంగతీ విదితమే. 

ఐటీ, ఔషధ రంగాలపై ప్రభావం తక్కువే

లాక్‌డౌన్‌లో వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్తంభించిపోగా, చాలా సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు అన్ని రంగాల్లోని ఉద్యోగులు మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఐటీ, ఔషధ, వైద్య, బీఎఫ్‌ఎస్‌ఐ పరిశ్రమల్లో ఉద్యోగుల తొలగింపుల ప్రభావం పెద్దగా లేదని, జీతాల కోత కూడా తక్కువేనని తాజా సర్వేలో తేలింది. దీంతో ఈ రంగాల్లోని ఉద్యోగులు ఇతర ఉద్యోగాల వైపు చూడటం లేదు. ఈ సర్వేలో 50 వేల మంది ఉద్యోగార్థుల అభిప్రాయాలను నౌకరీడాట్‌కామ్‌ సేకరించింది. జాబ్‌ మార్కెట్‌, కెరియర్‌ ప్రగతి, జీతాల పెంపుపై వీరంతా స్పందించారు. కాగా, ఉద్యోగాలు పోతాయన్న భయం, జీతాలు తగ్గుతాయన్న ఆందోళనలతో వేరే ఉద్యోగాలను వెతుక్కోవడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. 

మెరుగైన అవకాశాల కోసమే..

దాదాపు 70 శాతం మంది అత్యుత్తమ కెరియర్‌ అవకాశాల కోసమే ప్రస్తుత ఉద్యోగాల నుంచి మార్పును కోరుకుంటున్నట్లు నౌకరీడాట్‌కామ్‌ తెలిపింది. వేతనాల కోతల భయంతో 16 శాతం మంది, ఉద్యోగాల తీసివేతల ఆందోళనతో 14 శాతం మంది కొత్త ఉద్యోగాల వేటలో ఉన్నట్లు చెప్పింది. ఇకపోతే ఉద్యోగార్థుల్లో దాదాపు 10 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాలను కోల్పోయినవారుండగా, 15 శాతం చొప్పున విమానయాన రంగం, ఈ-కామర్స్‌ పరిశ్రమల ఉద్యోగులున్నారు. అలాగే 14 శాతం మంది ఆతిథ్య రంగం ఉద్యోగులు నూతన కొలువుల కోసం అన్వేషిస్తున్నారు.


logo