శుక్రవారం 05 జూన్ 2020
Business - Mar 31, 2020 , 00:42:47

మాయా టోరియం

మాయా టోరియం

  • ఈఎంఐవాయిదా లాభమా! నష్టమా?
  • రుణగ్రహీతల్లో అయోమయం

సంతోష్‌ వయసు 36 ఏండ్లు. ఓ ప్రైవేట్‌ సంస్థలో సాధారణ ఉద్యోగి. పదేండ్లుగా సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతేడాది తన బడ్జెట్‌లో ఓ అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ బ్యాంక్‌లో రూ.13 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. ఇప్పటికే  10 నెలసరి వాయిదా (ఈఎంఐ)లూ చెల్లించాడు. అయితే కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ విధించిన మారటోరియంను తీసుకోవాలా?.. వద్దా?.. అన్న డైలమాలో పడిపోయాడు. ఈ పరిస్థితి ఒక్క సంతోష్‌దే కాదు. మనలో చాలామందికి ఇదే సందేహం. అసలు మారటోరియం తీసుకుంటే లాభమా?.. నష్టమా?.. అన్నది తెలియని సంకట స్థితిలో ఉన్నారు. ఒకటో తారీఖు వచ్చేస్తున్నా స్పష్టత లేకపోవడం రుణగ్రహీతలను అయోమయానికి గురిచేస్తున్నది.

మారటోరియం కావాలంటే ఏం చేయాలి?

మారటోరియం కావాలనుకున్నవారు ముందుగా మీరు రుణాలు తీసుకున్న బ్యాం కులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ప్రతినిధులను కలుసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఎప్పట్లాగే మీ ఈఎంఐ మొత్తాన్ని మీ ఖాతాల నుంచి రుణదాతలు తీసుకోవచ్చు. అయితే దీనిపై ఇప్పటివరకు       స్పష్టత లేదు. కాగా, మరికొన్ని సంస్థలు ఈ విధానం కోసం ఆన్‌లైన్‌ అభ్యర్థనల్ని స్వీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. కరోనా వైరస్‌ వల్ల తమ ఆదాయం పడిపోయిందని, ఈఎంఐలను చెల్లించలేని స్థితిలో ఉన్నామని రుణదాతలకు మీరు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది విశ్వసనీయంగా ఉంటేనే మీకు మారటోరియం అవకాశం లభిస్తుందని కొందరు బ్యాంక్‌ ఉద్యోగులు చెప్తున్నారు. అయితే ఎస్బీఐ తమ కస్టమర్లందరి టర్మ్‌ లోన్లు ఆటోమేటిగ్గా మూడు నెలలు వాయిదా పడుతాయని ప్రకటించినట్లు సమాచారం. దీనిపైనా స్పష్టత రావాల్సి ఉన్నది.

తీసుకుంటే ఏం జరుగుతుంది?

మారటోరియం తీసుకున్నవారికి మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కిస్తీ చెల్లింపుల నుంచి తాత్కాలికంగా మినహాయింపు లభిస్తుంది. ఈ మూడు నెలల ఈఎంఐలను బ్యాంకులు తిరిగి ఎలా వసూలు చేసుకుంటాయి? అన్నదానిపై కొన్ని సందేహాలు, మరికొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారటోరియం అన్నది బ్యాంక్‌ బోర్డు నిర్ణయించేదని, ఈ వ్యవస్థీకృత అంశాన్ని లోతుగా చర్చించాల్సి ఉంటుందని ఓ మాజీ సీనియర్‌ బ్యాంకర్‌ తెలిపారు. అందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే మారటోరియంతో ఈఎంఐ మారబోదని, రుణ కాలపరిమితి మాత్రమే కాస్త పెరుగుతుందని చెప్పారు. కాగా, మరికొందరి వాదనల ప్రకారం చూస్తే.. మీరు రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏండ్ల కాలపరిమితితో తీసుకున్నారనుకుందాం. దానికి నెలకు రూ.30 వేల ఈఎంఐని చెల్లిస్తున్నారనుకుందాం. ఇందులో రూ.22 వేలు వడ్డీ, రూ.8 వేలు అసలుగా ఉంటే.. మూడు నెలల వడ్డీ రూ.66 వేలు మీరు తీసుకున్న రూ.25 లక్షల గృహ రుణానికి చేరి రూ.25.66 లక్షలుగా మారుతుంది. అంతేగాక అసలు రూ.24 వేల కోసం కాలపరిమితి 3 నెలలు పెరుగుతుంది. ఇక ఈ అదనపు వడ్డీ రూ.66 వేలకు మీరు ఇంకా చెల్లించాల్సిన కాలపరిమితి మొత్తం ఈఎంఐల సంఖ్యతో భాగించి విభజిస్తారు. దీనివల్ల ఈఎంఐ స్వల్పంగా పెరగొచ్చు. వాహన, విద్యా, వ్యక్తిగత రుణాలకూ ఇదే లెక్క ఉంటుందని సమాచారం. దీనిపై బ్యాంకర్లు స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. 

మారటోరియం అంటే?

మారటోరియం అంటే కేవలం వాయిదానే. రద్దు ఎంతమాత్రం కాదు. అంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల ఇచ్చిన మూడు నెలల మారటోరియంతో ఈ మూడు నెలల ఈఎంఐలను తర్వాత చెల్లించేందుకు మనకు దక్కిన అవకాశం మాత్రమే. సాధారణంగా రుణం తీసుకున్నవారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా నెలసరి ఈఎంఐలను అప్పిచ్చిన సంస్థలకు విధిగా చెల్లించాల్సిందే. అలా జరుగని పక్షంలో డిఫాల్టర్లుగా మారుతారు. కానీ కరోనా మహమ్మారితో దేశంలో నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులు ప్రజలందరినీ ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆర్బీఐ ఈ మూడు నెలల వెసులుబాటును కల్పించింది. దీంతో ఈఎంఐలు చెల్లించకపోయినా డిఫాల్ట్‌ కాబోము. మన క్రెడిట్‌ స్కోర్‌కూ వచ్చిన ఇబ్బందేమీ లేదు.

ఎవరికి లాభం?

వేతన జీవుల కంటే వ్యాపారులకు ఈ మారటోరియం ఎక్కువ లాభమని నిపుణులు చెప్తున్నారు. నగదు  కొరతలేనివారు ఈఎంఐలను యథాతథంగా చెల్లించుకుంటేనే లాభమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు డీ పాపారావు అభిప్రాయపడ్డారు. మారటోరియం అంటే ఈఎంఐల రద్దు కాదని, వాయిదా మాత్రమేనన్న ఆయన.. మారటోరియం తీసుకోవాలనుకున్నవారు ఈ మూడు నెలల మొత్తం ఆపడం వల్ల అంతకంటే ఎక్కువ లాభం ఉంటుందా? అన్నదానిపై ఆలోచించుకోవాలని సూచించారు. అయితే కరోనా ధాటికి ఆదాయం ప్రభావితమైనవారందరికీ ఆర్బీఐ నిర్ణయం మాత్రం  గొప్ప ఊరటేనన్న అభిప్రాయాలు కచ్ఛితంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి బ్యాంకుల నుంచి మారటోరియంపై స్పష్టత వస్తేగానీ  ఈ అయోమయానికి తెరపడదు.


logo