గురువారం 28 మే 2020
Business - May 03, 2020 , 01:47:19

మస్క్‌ ట్వీట్‌తో తంటా

మస్క్‌ ట్వీట్‌తో తంటా

  • టెస్లా మార్కెట్‌ విలువ 1,400 కోట్ల డాలర్లు పతనం

శాన్‌ఫ్రాన్సిస్కో, మే 2: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం ‘టెస్లా’ సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌కు ఆ సంస్థ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక్క ట్వీట్‌తో శుక్రవారం ఆ కంపెనీ షేర్‌ విలువ 80.56 డాలర్లు క్షీణించి 701.32 డాలర్లకు దిగజారింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్‌ విలువ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 1,400 కోట్ల డాలర్ల మేరకు క్షీణించడంతోపాటు కంపెనీలో మస్క్‌కు గల సొంత వాటాలో దాదాపు 300 కోట్ల డాలర్లు హరించుకుపోయాయి. ప్రస్తుతం టెస్లా షేర్‌ విలువ చాలా అధికంగా ఉన్నట్టు అభిప్రాయపడుతున్నానని మస్క్‌ చేసిన ట్వీటే ఇందుకు కారణం. ఈ ట్వీట్‌తో టెస్లాలో మస్క్‌ సీఈవో పదవికి కూడా ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నా యి. గతంలోనూ ఓ ట్వీట్‌పై వివాదం చెలరేగడంతో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) 40 మిలియన్‌ డాలర్ల పెనాల్టీ విధించింది. ఈ జరిమానాను మస్క్‌, టెస్లా చెరోసగం చెల్లించడంతో వివాదం పరిష్కారమైంది. కానీ టెస్లా డైరెక్టర్ల బోర్డులో మస్క్‌ చైర్మన్‌ పదవి ఊడింది.


logo