శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 22, 2020 , 22:04:59

విద్యుత్‌ వాహనాలకు ఉందిలే మంచి కాలం..

విద్యుత్‌ వాహనాలకు ఉందిలే మంచి కాలం..

న్యూఢిల్లీ: భారతదేశంలో 2027 నాటికి విద్యుత్‌ వాహనాల విక్రయాలు 63.4 లక్షలకు చేరతాయని ఇండియా స్టోరేజీ ఎనర్జీ అలయెన్స్‌ (ఐఈఎస్‌ఏ) తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు, విద్యుత్‌ వాహనాల భవిష్యత్‌పై అంచనాలు, ఈవీ చార్జింగ్‌ మౌలిక వసతులు, ఈవీ బ్యాటరీల వినియోగంపై ఐఈఎస్‌ఏ అధ్యయనం జరిపింది. ఈ ఏడేండ్ల కాలంలో ఈవీ బ్యాటరీలకు గణనీయంగా డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొంది. 

2027 నాటికి విద్యుత్‌ వాహనాల మార్కెట్‌ ఏటా 44 శాతం వృద్ధి చెందనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 3.8 లక్షల విద్యుత్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈవీ బ్యాటరీల సామర్థ్యం 5.4గిగావాట్లకు చేరుకున్నది. ప్రతి సంవత్సరం ఈవీ బ్యాటరీల కొనుగోళ్ల డిమాండ్‌ 32 శాతం పెరిగి 2027కల్లా అది 50 గిగావాట్ల సామర్థ్యానికి దూసుకెళ్తుందని ఐఈఎస్‌ఏ వెల్లడించింది. ఇందులో 40గిగావాట్లకు పైగా లిథియం ఆయాన్‌ బ్యాటరీలే ఉంటాయి. 

గత ఆర్థిక సంవత్సరం 580 మిలియన్ల డాలర్ల లక్ష్యానికి ఈవీ బ్యాటరీల మార్కెట్‌ చేరుకుంటుందని అంచనా వేయగా, వచ్చే ఏడేండ్లలో అది 14.9 బిలియన్‌ డాలర్లకు దూసుకువెళ్లనున్నది. గతేడాది జరిగిన ఈవీ వాహనాల్లో అత్యధిక వాటా టూ వీలర్స్‌దే కావడం ఆసక్తికర పరిణామం. ఫేమ్‌-2 స్కీమ్‌తో 2020లో విద్యుత్‌ టూవీలర్స్‌ కొనుగోళ్లు శరవేగంగా పెరుగుతాయని, లిథియం ఆయాన్‌ బ్యాటరీల టెక్నాలజీతో ప్రస్తుతం సంప్రదాయంగా కొనసాగుతున్న యాసిడ్‌ బ్యాటరీ టెక్నాలజీ వచ్చే ఐదేండ్లలో  పూర్తిగా కనుమరుగవుతుందని ఐఈఎస్‌ఏ వివరించింది. 

ఇప్పటికే రాయ్‌పూర్‌, ఇండోర్‌, భోపాల్‌లలో అడుగు పెట్టిన ఈ-రిక్షా మార్కెట్‌ మున్ముందు ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నది. ఇక కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలతో విద్యుత్‌ బస్సులకు డిమాండ్‌ పెరుగుతుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo