జూన్లో 8.9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జూలై 30: సహజ వాయువు, ఉక్కు ఉత్పత్తి ఆకర్షణీయంగా ఉండటంతో గత నెల 8 కీలక రంగాల వృద్ధిరేటు 8.9 శాతంగా నమోదైంది. ఈ మేరకు శుక్రవారం అధికారిక గణాంకాలు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం జూన్లో గ్యాస్ 20.6 శాతం, స్టీల్ 25 శాతం చొప్పున ఉత్పాదక రేటు వృద్ధిని నమోదు చేశాయి.
బొగ్గు (7.4 శాతం), రిఫైనరీ ఉత్పత్తులు (2.4 శాతం), సిమెంట్ (4.3 శాతం), విద్యుత్తు (7.2 శాతం), ఎరువుల (2 శాతం) రంగాల్లోనూ ఉత్పాదక రేటు పెరిగింది. అయితే ముడి చమురు ఉత్పత్తి 1.8 శాతం పడిపోయింది. కాగా, నిరుడు జూన్ లో ఈ కీలక రంగాల్లో ప్రగతి మైనస్ 12.4 శాతంగా నమోదైంది.
ఇందుకు లాక్డౌన్ కారణమవగా, లో బేస్ కూడా తాజా గణాంకాల్లో పెరుగుదలకు ఊతమిచ్చింది. ఇక ఈ ఏడాది మే నెలలో ఈ రంగాల వృద్ధిరేటు 16.3 శాతంగా ఉంటే, అంతకుముందు నెల ఏప్రిల్లో 60.9 శాతంగా ఉన్నది. దీంతో ఈ ఏప్రిల్-జూన్లో 25.3 శాతంగా వృద్ధిరేటు ఉంటే, పోయినసారి ఇదే వ్యవధిలో మైనస్ 23.8 శాతం క్షీణించింది.