ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 19, 2020 , 00:23:13

మరో రూ.204 కోట్లు

 మరో రూ.204 కోట్లు
  • - బీపీఎస్‌ఎల్‌ కేసులో రూ.4,229 కోట్లకు చేరిన ఈడీ ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ, జనవరి 18: భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (బీపీఎస్‌ఎల్‌) మాజీ సీఎండీ సంజయ్‌ సింఘాల్‌కు చెందిన రూ.204 కోట్లకుపైగా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఢిల్లీతోపాటు లండన్‌లోని స్థిరచరాస్తులు, బీపీఎస్‌ఎల్‌లో ఈక్విటీ పెట్టుబడులు వీటిలో ఉన్నాయని ఈడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా ఈడీ స్వాధీ నం చేసుకున్న ఆస్తుల విలువ రూ.4,229 కోట్ల కు చేరింది. ఇక్కడి మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టులో సింఘాల్‌, మరికొందరిపై శుక్రవారం ఈడీ చార్జిషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దీన్ని నమోదు చేసింది. సంస్థతోపాటు 24 మంది పేర్లను ఇందులో ఈడీ పేర్కొన్నది. దీంతో కోర్టు ప్రొడక్షన్‌ వారెంట్‌ను జారీ చేసింది.


ఈ నెల 21న హాజరుపరుచాలని ఆదేశించింది. బీపీఎస్‌ఎల్‌ పేరిట తీసుకున్న రుణాల్లో రూ.204.31 కోట్లను సింఘాల్‌ పక్కదారి పట్టించారని, దేశ విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ఆ నిధులను ఉపయోగించారని ఈడీ చెప్తున్నది. 2007-14 మధ్య 33 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి బీపీఎస్‌ఎల్‌ పెద్ద ఎత్తున రుణాల ను తీసుకున్నది. వీటిలో చాలా వరకు ఆస్తుల కొనుగోలుకే వెచ్చించింది. గతేడాది నవంబర్‌లో సింఘాల్‌ను ఈడీ అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే మరో రూ.204 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. డొల్ల సంస్థలను సృష్టించి బ్యాంక్‌ రుణాలను సింఘాల్‌ దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపిస్తున్నది. 


logo