గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 05, 2020 , 23:41:48

దేశం దారెటు?

దేశం  దారెటు?

ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు పాతాళానికి పడిపోగా, రూపాయి బక్కచిక్కుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి స్టాక్‌ మార్కెట్లు నేలచూపులే చూస్తున్నాయి. వీటికితోడు చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌ దెబ్బ దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు స్టాక్‌ మార్కెట్లను కుప్పకూలుస్తున్నది. గడిచిన వారం రోజుల్లో సెన్సెక్స్‌ 2 వేల పాయింట్లకు పైగా నష్టపోవడంతో మదుపరుల సంపద ఏకంగా రూ.12 లక్షల కోట్లు హారతి కర్పూరంలా కరిగిపోయింది.

  • నానాటికీ క్షీణిస్తున్న జీడీపీ
  • ఐసీయూలో భారత ఆర్థిక వ్యవస్థ!
  • వారంలో 2వేల పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
  • మదుపరుల సంపద 12 లక్షల కోట్లు మాయం
  • వృద్ధిరేటుపై నీలినీడలు
  • ద్రవ్యోల్బణం విజృంభణ
  • పతనావస్థలో రూపాయి మారకం విలువ
  • వేధిస్తున్న పెట్టుబడుల కొరత
  • తోడైన నిరుద్యోగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ :  భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. గడిచిన ఇరవై మూడేండ్లలో ఇంత దారుణంగా పడిపోవడం ఇదే తొలిసారి. 1996 తర్వాత స్థూల దేశీయోత్పత్తి 4.5 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థ పతనావస్థను సూచిస్తున్నది. ఐసీయూకు చేరిన భారత ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయడానికి సమర్థులైన ఆర్థిక వేత్తలే మన దేశంలో కరువయ్యారా?.. మాజీ ఆర్‌బీఐ గవర్నర్లు రఘురామ్‌ రాజన్‌, ఊర్జిత్‌ పటేల్‌, ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్‌ సుబ్రమణియన్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అర్వింద్‌ పనగరియా వంటి నిపుణుల సేవలను వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా?.. అంటే ఔననే సమాధానం వినిపిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసేలా కేంద్రం వద్ద కనీసం ఒక్క విభిన్న  పథకం కూడా లేకపోవడం విచారించదగ్గ విషయం. ఇంతకీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవ్వడానికి.. స్థూల దేశీయ ఉత్పత్తి దారుణంగా పడిపోవడానికి గల కారణాలేమిటి? అంతర్జాతీయ మార్కెట్లో మందగమన పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్టంగా జీఎస్టీ అమలు, విదేశీ ఎగుమతుల్లో క్షీణత ప్రభావం వాహన, జౌళి రంగాలపై పడటం, నిర్మాణ, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడం వంటి అంశాల కారణంగా దేశ జీడీపీ క్రమక్రమంగా పతనమవుతూ వస్తున్నది.


 దీంతో రైతులు, కూలీలు, కార్మికులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు.. ఇలా ప్రతిఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో ఉత్పత్తి, నిర్మాణ, గనుల రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, వృత్తిపరమైన సేవలు, వ్యక్తిగత వినియోగం వంటివి గణనీయంగా తగ్గముఖం పట్టాయి. భారత జీడీపీ వరుసగా ఆరు త్రైమాసికాల నుంచి, అంటే ఏడాదిన్నర నుంచి క్షీణిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులు కేవలం రెండు శాతం చొప్పున వృద్ధి చెందాయి. వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 1.9% నుంచి 7.4 శాతానికి పెరుగగా.. వ్యవసాయ రుణాలు 18.3 నుంచి 5.3 శాతానికి, చిన్న, మధ్యతరహా సంస్థలకిచ్చే రుణాలు 6.7 నుంచి 1.6 శాతానికి పడిపోయింది. పారిశ్రామిక సూచి వృద్ధి కూడా 0.6 శాతానికి పరిమితమైంది. దేశంలో దాదాపు ప్రతి భారీ పరిశ్రమ వృద్ధి సున్నా లేదా ప్రతికూలానికి జారుకున్నది. 


కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు.. భారత ఆర్థిక వ్యవస్థ పతనమవ్వడానికి గల కారణాలకు లెక్కే లేదు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో వస్తువులు, సేవలు వంటివాటికి గిరాకీ పెరగాలి. గిరాకీ అధికంగా ఉన్నప్పుడే ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం భారీ స్థాయిలో కార్మిక శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగైనప్పుడే, తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయగల్గుతారు. ఆర్థిక లావాదేవీలు వరుస క్రమలోజరుగుతున్నప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కాకపోతే, మన వద్ద గిరాకీయే లేకపోతే ఎలా? ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా మరెలా ఉంటుంది? స్థూలంగా గమనిస్తే.. మన దేశ జీడీపీలో వినియోగం వాటా ఎంతలేదన్నా 55-58 శాతం దాకా ఉంటుంది. వ్యక్తిగత వినియోగం తగ్గినప్పు డు, దాని ప్రతికూల ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడటమూ సర్వసాధారణమే కదా! 


కొత్త పెట్టుబడుల్ని ఆకర్షించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. 2019 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో కొత్తగా వచ్చిన పెట్టుబడుల వాటా 20.5 శాతం మాత్రమే. 2004 సెప్టెంబరు నుంచి దేశీయ ఆర్థిక స్థితిగతుల్ని క్షుణ్ణంగా గమనిస్తే.. పెట్టుబడుల ఆకర్షణలో ఇంతకంటే క్షీణత లేదనే చెప్పాలి. దీన్నిబట్టి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై విదేశీ సంస్థలకు పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. దేశీయ బ్యాంకింగ్‌ రంగం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది.  నిరర్థక ఆస్తుల (మొండి బకాయిలు) విలువ ఎంతలేదన్నా రూ.10 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా. దీంతో కొత్త రుణగ్రహీతలకు అప్పులిచ్చే పరిస్థితులు బ్యాంకులకు లేకుండా పోయాయి. పైగా ఇటీవల పలు బ్యాంకుల్ని విలీనం చేయడంతో పెట్టుబడిదారులు, డిపాజిటర్ల మనసులో వ్యతిరేక భావాలు నెలకొన్నాయి. ఒకరకమైన అరాచక వాతావరణం నెలకొన్నది.


భారతదేశపు ఆర్థిక వృద్ధి కథలో వ్యవసాయ రంగానిదీ కీలకమైన పాత్రే. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయానిదే దాదాపు పదిహేను శాతం వాటా. పైగా, మన దేశంలోని 55 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి ఈ రంగ మూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నది. రైతు పండించిన పంటకు కనీస మద్ధతు ధర లభించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతల రూపంలో సొమ్మంతా తీసుకెళ్లి రెండు వందల కార్పొరేట్‌ సంస్థల చేతిలో పోస్తే ఆర్థిక వ్యవస్థ  చక్కబడుతుందనే భ్రమల్లో కేంద్రం ఉన్నట్టుగా అనిపిస్తున్నది. దీనివల్ల కార్పొరేట్‌ సంస్థలు అందించే వస్తువులు, సేవలు వినియోగదారులకు నామమాత్రపు ధరకే చేరే అవకాశాలున్నాయి. కాకపోతే, వాటిని అందుకునే ఆర్థిక స్థోమత లేనప్పుడు.. తక్కువ రేటుకే వస్తువులు, సేవలు లభించినా ప్రయోజనం శూన్యమే కదా! అందుకే, కేంద్రం ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ, గత ఆరేండ్లుగా ఇలాంటి ఉపయోగకరమైన నిర్ణయాల్ని కేంద్రం తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.


పెద్దనోట్ల రద్దు దేశీయ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌) వల్ల కేంద్రానికి దాదాపు లక్ష కోట్లదాకా పన్ను వసూళ్లు వస్తున్నాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే నిర్ణయమే. కాకపోతే అమలులో ఘోరమైన తప్పిదం చేయడం వల్ల చిన్నాచితక వ్యాపారులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అసలే వీరికి గల ఆర్థిక శక్తి అంతంత మాత్రమే. జీఎస్టీ సొమ్మును వెనక్కి తెచ్చుకునేందుకు రకరకాల తంటాలు పడుతున్నారు. తమ సొమ్మంతా ప్రభుత్వం చేతిలో ఇరుక్కుపోవడంతో వ్యాపారులు గగ్గోలు చేస్తున్నారు.


కరోనా వైరస్‌తో దేశ వృద్ధిరేటుపై స్వల్ప ప్రభావం మాత్రమే చూపనున్నదని బ్లూంబర్గ్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది. ఈ వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు భారీగా పతనమవడంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి దోహదపడనున్నదని తెలిపింది. 


అంతర్జాతీయ కారణాలేమిటి? 

అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వాహన, జౌళి పరిశ్రమలకు గిరాకీ గణనీయంగా తగ్గింది. భారత ఎగుమతులపై ప్రతికూల వాతావరణం ఏర్పడింది. వాహన రంగంలో వేలాదిమంది ఉద్యోగాల్ని కోల్పోయారు. పలు రంగాల్లో భారతదేశం ప్రపంచ లీడర్‌గా ఎదుగుతుండగా, ఈ ప్రతికూల వాతావరణం ఒక్కసారిగా దెబ్బతీసింది. డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు విధానాల కారణంగా, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఏర్పడింది. దీంతో ఆ రెండు దేశాలు  పతనమయ్యాయి. దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడింది. భారత ఆర్థిక మంత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ కాస్త నెమ్మదిగానే కోలుకునే అవకాశమున్నది. కరోనా వైరస్‌ వల్ల చైనా మార్కెట్‌  ఎంతమేరకు దెబ్బతిన్నది? దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌కు కలిగే నష్టమేమిటనే విషయాల్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందని మూడీస్‌ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ విశ్లేషిస్తున్నది. 


ప్రమాద సంకేతాలిస్తున్న సర్వే సంస్థలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు అంచనాల్ని 3.3 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గిస్తున్నాం. ఈ ప్రాణాంతక మహమ్మారి ప్రపంచ సమస్యగా పరిణమించింది. దీని ప్రభావం దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేస్తున్నది.

-క్రిస్టాలినా జార్జీవా, ఐఎంఎఫ్‌ చీఫ్‌


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 4.9 శాతానికే పరిమితం కావచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను గతంలో వేసిన మా అంచనాల్నీ సవరిస్తున్నాం. 6.2 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గిస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.

-ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)


‘ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాల్ని 5.4 శాతానికి తగ్గిస్తున్నాం. ఇంతకుముందు 6.6 శాతంగా అనుకున్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మా అంచనాల్ని సవరిస్తున్నాం’

-గ్లోబల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌


‘ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 4.9 శాతానికి తగ్గిస్తున్నాం. గత అంచనా 5.1 శాతంగా ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా 5.9 శాతం నుంచి 5.4 శాతానికి కుదిస్తున్నాం. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి’

-క్రిస్టాలినా జార్జీవా, ఐఎంఎఫ్‌ చీఫ్‌


జీడీపీ తగ్గిందెంత?

2014 నుంచి 2019 మధ్యకాలంలో సరాసరిగా 7.5 శాతానికిపైగా వృద్ధి చెందిన భారత ఆర్థిక వ్యవస్థ.. 2019 సెప్టెంబర్‌ వరకు 4.5 శాతానికి పడిపోయింది. గత ఆరేండ్లలోనే ఇదే కనిష్ఠ స్థాయి. ఉత్పత్తి రంగంలో క్షీణత వల్ల వ్యవసాయ రంగం కార్యకలాపాలు దారుణంగా పడిపోయాయి. వాస్తవానికి, 2014లో భారత ఆర్థిక వ్యవస్థ రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని, ఇది 2019 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్లకు ఎగబాకుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) గతంలో అంచనావేసింది. రష్యా, బ్రెజిల్‌, ఇటలీ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలను అధిగమిస్తుందని అప్పట్లోనే అంచనా వేసింది. 2014లో క్షీణత దశ నుంచి భారత్‌ కోలుకున్నదని, సమర్థవంతమైన విధానాల వల్ల ఆర్థిక వృద్ధి ఐదు శాతం దాటిందని ప్రశంసించింది. కాకపోతే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ వృద్ధి రేటు ఆశించినదానికంటే బలహీనంగా నమోదు అయ్యిందని ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ గెర్రీ రైస్‌ అభిప్రాయపడ్డారు.


logo