బుధవారం 27 మే 2020
Business - Apr 19, 2020 , 00:35:52

అగాధంలో ఆర్థిక వ్యవస్థ

అగాధంలో ఆర్థిక వ్యవస్థ

  • కరోనా కాటుకు కుప్పకూలిన ప్రపంచం
  • అన్ని దేశాలను తీవ్ర మాంద్యంలోకి నెట్టిన మహమ్మారి 
  • అభివృద్ధి చెందుతున్న దేశాలకు సవాలే: ఐఎంఎఫ్‌ హెచ్చరిక

ఆర్థిక మందగమనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి తీవ్ర మాంద్యంలోకి నెట్టింది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్‌ ఉద్ధృతిని ఆపలేక చేతులెత్తేస్తున్నాయి. ప్రాణనష్టంతోపాటు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుండటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలకు మున్ముందు ఎన్నో భయంకరమైన సవాళ్లు తప్పవని ఐఎంఎఫ్‌ హెచ్చరిస్తున్నది.

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 18: కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉసురు తీస్తున్నది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వృద్ధిరేటును మింగేస్తున్నది. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి మాంద్యంలోకి నెట్టిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో జీడీపీ మైనస్‌కే పరిమితం కావడం తథ్యమని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా దెబ్బ తీవ్రంగా తగిలిందన్నారు. ఈ సంక్షోభంతో చాలా దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భవిష్యత్తులో భయంకరమైన సవాళ్లు తప్పవని హెచ్చరించారు. వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితితో కుంగిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా పిడుగు పడిందని వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు అందరినీ వేధిస్తున్నది కరోనా వైరస్‌ సంక్షోభమే. ప్రభుత్వాలకు, సెంట్రల్‌ బ్యాంకులకు దీన్ని మించిన సవాల్‌ ఏదీ లేదు. ఆరోగ్య వ్యవస్థ అంతంతమాత్రంగా ఉన్న దేశాల మనుగడనే ఈ మహమ్మారి ప్రశ్నార్థకం చేస్తున్నది’ అని జార్జీవా అన్నారు. 143 దేశాల్లోని 37 కోట్ల మంది పిల్లల్లో పౌష్ఠికాహార లోపం పెరగనుందని హెచ్చరించారు. చైనా, దక్షిణ కొరియా, ఇటలీల్లో తయారీ రంగం కుదేలవడం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిందన్నారు. కాగా, వచ్చే ఏడాది ప్రపంచ వృద్ధిరేటు పుంజుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆమె.. 2021 ఆఖరుకల్లా మునుపటి పరిస్థితులు ఏర్పడగలవన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

ప్రపంచ ఉద్దీపనల విలువ వెయ్యి లక్షల కోట్లు

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని తట్టుకుని నిలబడేందుకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఉద్దీపనల్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రకటించిన ఈ ఉద్దీపనల విలువ దాదాపు 14 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.1,071 లక్షల కోట్లు) అని ఐఎంఎఫ్‌ కమిటీ చైర్మన్‌ లెసెట్జా గాన్యాగో తెలిపారు. ఇందులో దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లు వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపనలని స్పష్టం చేశారు. మిగతా 6 లక్షల కోట్ల డాలర్లకుపైగా ఉద్దీపనలు ఆయా దేశాల రిజర్వ్‌ బ్యాంకులు ప్రకటించినవని విలేకరుల సమావేశంలో చెప్పారు. కాగా, తమ సభ్య దేశాల్లోని పేద దేశాలకు ఆర్థిక సాయం చేస్తున్నామని, 50 దేశాలకు ఈ నెలాఖర్లోగా సాయం అందుతుందని గాన్యాగో చెప్పారు.

జీడీపీ కోసం బెజోస్‌ చిట్కా

కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ చిట్కా ఇచ్చారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా సామూహికంగా జరగాలన్నారు. ప్రత్యేకంగా అన్ని పరిశ్రమల్లో నిత్యం జరగాలని అప్పుడే ప్రజలు, ఆర్థికవ్యవస్థ క్షేమంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. వైరస్‌ నిర్ధారణ కోసం ఇప్పుడున్న సామర్థ్యం చాలదని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ఉద్ఘాటించారు. తమ ఉద్యోగుల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అందరికీ కరోనా పరీక్షలు చేస్తామని, ఈ వ్యాధి లక్షణాలు లేనివారికీ టెస్టులు తప్పవని వాటాదారులకు రాసిన వార్షిక లేఖలో బెజెస్‌ పేర్కొన్నారు. మరోవైపు న్యూయార్క్‌లో 16 మిలియన్‌ డాలర్లతో కొత్త అపార్టుమెంట్‌ను బెజోస్‌ కొన్నారు.


logo