ఆదివారం 24 మే 2020
Business - Feb 01, 2020 , 00:58:48

భవిష్యత్ ఆశాజనకం

భవిష్యత్ ఆశాజనకం
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధిరేటు
 • కేంద్రానికి ఆర్థిక సర్వే 2019-20 సూచన
 • వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించాలి
 • రైతుల ఆదాయాన్ని పెంపొందించాలి
 • సంపద సృష్టించేవారిని గౌరవించాలి
 • వచ్చే మూడేండ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాలి
 • ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాలి
 • అప్పుడే 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోగలం
 • మార్కెట్లకు సాధికారత కల్పించాలి

న్యూఢిల్లీ, జనవరి 31: ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 6 నుంచి 6.5 శాతానికి పెరుగుతుందని ఆర్థిక సర్వే 2019-20 అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి దిగజారి దశాబ్దకాల కనిష్ఠస్థాయికి పడిపోయిన స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటుకు ఊతమిచ్చేందుకు ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాలని ఈ సర్వే కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉండటం, ఆర్థిక వృద్ధిని సాధించడంలో ఏదో ఒకటే సాధ్యమవుతుందని ఈ సర్వే తేల్చిచెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ఆర్థిక సర్వేను శుక్రవారం విడుదల చేశారు. 2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తిన నాటినుంచి ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గుతుండటంతోపాటు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటును, పారిశ్రామికవేత్తలను ప్రో త్సహించాలని, సంపదను, ఉద్యోగాలను సృష్టించేవారిని గౌరవించాలని ఈ సర్వే పేర్కొన్నది. 

ఆహార సబ్సిడీని కుదించాలి

పన్ను రాబడులు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక అంతరాన్ని సృష్టించేందుకు ఆహార సబ్సిడీని కుదించుకోవాలని స్పష్టం చేసింది. ఆర్థిక సర్వే సూచించింది. 2025 సంవత్సరం నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడం, మార్కెట్లకు సాధికారత కల్పించడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం ఎంతో కీలకమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, పన్నుల చెల్లింపు, కాంట్రాక్టుల అమలు లాంటి కార్యకలాపాలను సులభతరం చేసేందుకు సంస్కరణలు చేపట్టాలని సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని దాదాపు రెట్టింపు స్థాయికి (5 లక్షల కోట్ల డాలర్లకు) పెంచుకోవాలంటే ‘ప్రపంచం కోసం భారత్‌లో అసెంబ్లింగ్‌' (అసెంబుల్‌ ఇన్‌ ఇండియా ఫర్‌ ది వరల్డ్‌) అనే భావనతో తయారీ రంగానికి ఊతమివ్వడంతోపాటు రానున్న మూడేండ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సిన అవసరమున్నదని ఉద్ఘాటించింది. అధిక లాభదాయకత కోసం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, మార్కెట్లలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని స్పష్టం చేసింది. 

ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాలి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 5 శాతానికి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. గత 11 ఏండ్లలో ఇదే అత్యల్ప వృద్ధిరేటు. ఈ నేపథ్యంలో వృద్ధిరేటును పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని, ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. పెట్టుబడుల వ్యయాన్ని పెంపొందించడం, రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకోవడం ఆస్తుల సృష్టికి దారితీస్తుందని, దీంతో పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందని తెలిపింది. దేశంలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు పోర్టుల్లో అలసత్వ ధోరణిని తొలిగించి ఎగుమతులను పెంపొందించాలని, ప్రభుత్వరంగ బ్యాంకులపనితీరును మెరుగుపరిచి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 

ఎగుమతులు పెంచుకోగలిగితే..

ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటాను గణనీయంగా పెంచుకోగలిగితే 2025 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు, 2030 నాటికి 8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఉద్యోగాల కల్పనకు చైనా అనుసరిస్తున్న విధానాలను భారత్‌ అనుసరించాలని సూచించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై ఒత్తిడి పెరుగడం, కుటుంబాల ఖర్చు తగ్గిపోవడం, ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు మందగించడం, పన్ను వసూళ్లు తగ్గడం ప్రస్తుతం భారత్‌ ముందున్న సవాళ్లని పేర్కొన్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రానికి ఉన్న వాటాలను ఓ కొత్త సంస్థను ఏర్పాటుచేసి దానికి బదిలీ చేయాలని, ఆయా కంపెనీల్లో ప్రభుత్వ వాటాల విక్రయాన్ని ఆ సంస్థే చూసుకొనేలా ఉండాలని సూచించింది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు మెరుగైన చర్యలు చేపడుతున్న దేశాల జాబితాలో భారత్‌ స్థానం గణనీయంగా మెరుగుపడిందని, 2014 నాటికి ఈ జాబితాలో 142వ ర్యాంకులో నిలిచిన భారత్‌ ప్రస్తుతం 79 స్థానాలను మెరుగుపర్చుకొని 63వ స్థానానికి ఎగబాకిందని తెలిపింది. పెట్టుబడులకు మూలధనం తగ్గింపు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొన్నది.

వ్యవసాయరంగంలో తగ్గనున్న వృద్ధి

వ్యవసాయరంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2.9 శాతంగా ఉంటుందని భావిస్తున్న వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.8 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండవచ్చని, గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది తక్కువని పేర్కొన్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ పథకం కింద 47.33 లక్షల ఇండ్ల నిర్మాణం జరిగిందని, స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కింద 2014 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్లకుపైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపింది. 2018లో ఏకంగా 1.24 లక్షల కంపెనీలు ఏర్పాటయ్యాయని, ఈ విషయంలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2018-19లో రైల్వే ప్రయాణికుల సంఖ్య 1.85 శాతం పెరిగి 840 కోట్లకు, సరుకుల లోడింగ్‌ 5.34 శాతం పెరిగి 120 కోట్ల టన్నులకు చేరిందని, దీంతో ఇండియన్‌ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్‌ క్యారియర్‌ గా, సరుకు రవాణాలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించిందని సర్వే పేర్కొన్నది.

‘సంపదను సృష్టించడంపై దృష్టి’


దేశంలో సంపదను సృష్టించడంపై ఆర్థిక సర్వే దృష్టిసారించిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు, ఎగుమతులు, వ్యాపారాన్ని సులభతరం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచేందుకు అనుసరించాల్సిన బహుముఖ వ్యూహాన్ని ఈ సర్వే వివరించిందని ఆయన ట్వీట్‌ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నెమ్మదిగా పుంజుకొంటుందని, మున్ముందు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని, పెట్టుబడులు తగ్గుతాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వృద్ధిరేటుపై ఈ సర్వే అంచనాలు అత్యాశతో కూడినవిగా ఉన్నాయని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దేశ వృద్ధిరేటును అంచనా వేయడంలో ఈ సర్వే గత ఐదేండ్లలో నాలుగేండ్లు విఫలమైంది. ప్రజలిచ్చిన బలమైన తీర్పును మోదీ ప్రభుత్వం సంస్కరణల అమలు వేగాన్ని పెంచేందుకు, ఇది 2020-21లో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకొనేందుకు దోహదపడుతుందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 2011 తర్వాత దేశ జీడీపీ వృద్ధిరేటును 2.7 శాతం మేరకు అతిగా అంచ నా వేశారని కేంద్ర ఆర్థికశాఖ మాజీ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన ఆరోపణను ఈ సర్వే రూపకర్త, ఆర్థికశాఖ ప్రస్తుత సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తోసిపుచ్చారు. ఈ ఆరోపణ నిరాధారమైనదని, గణాంకాలతో సరితూగడంలేదని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక సర్వే 2019-20 ముఖ్యాంశాలు

 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 5 శాతంగా ఉంటుందని భావిస్తున్న జీడీపీ  వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 నుంచి 6.5 శాతం వరకు పెరుగుతుందని అంచనా.
 • వృద్ధిరేటు పునరుద్ధరించేందుకు ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించడం అవశ్యం.
 • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగడం, డిమాండ్‌పై ఒత్తిడి, జీఎస్టీ ఆదాయంలో సానుకూల వృద్ధి నమోదవడం లాంటి 10 అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో వృద్ధిరేటు పెరుగుదలకు దోహదం చేశాయి.
 • 2025 సంవత్సరం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరాలంటే నైతిక పద్ధతుల్లో సంపదను సృష్టించడం కీలకం.
 • 2011-12 ఆర్థిక సంవత్సరంలో 17.9 శాతంగా ఉన్న సంఘటితరంగ ఉద్యోగిత వాటా 2017-18లో 22.8 శాతానికి పెరుగడం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణను ప్రతిబింబిస్తున్నది.
 • 2011-18 మధ్యకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 2.62 కోట్ల ఉద్యోగాల సృష్టి.
 • 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-18లో రెగ్యులర్‌ ఉద్యోగాలు పొందిన మహిళల సంఖ్య 8 శాతం పెరుగుదల.
 • బకాయిల రద్దుతో రుణ సంస్కృతికి విఘాతం కలుగడంతోపాటు రైతులకు వ్యవసాయ రుణాల లభ్యత తగ్గుతుంది.
 • ప్రభుత్వరంగ బ్యాంకుల సిబ్బంది పనితీరును మెరుపరిచి వాటిపట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి.
 • గతేడాది ఏప్రిల్‌లో 3.2 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 2.6 శాతానికి తగ్గడం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ ఒత్తిడి బలహీనంగా ఉండటాన్ని ప్రతిబింబిస్తున్నది.
 • గతేడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 4.1 మేరకు పెరిగాయి.logo