గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 14, 2020 , 01:19:37

కొలువులు గోవింద!

కొలువులు గోవింద!
  • ఆర్థిక మందగమనం ప్రభావం: ఎస్బీఐ రిసెర్చ్

ముంబై, జనవరి 13:దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం.. ఉద్యోగార్థుల ఆశలను ఆవిరి చేస్తున్నది. ఉపాధి కల్పన రంగాలను మందగమన పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదిక తేటతెల్లం చేసింది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2018-19)తో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) దాదాపు 16 లక్షల కొత్త ఉద్యోగాలు తగ్గవచ్చని చెప్పింది. 2018-19లో 89.7 లక్షల కొత్త కొలువులు పుట్టుకొచ్చాయని ఈపీఎఫ్‌వో గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. అయితే 2019-20 ఏప్రిల్-అక్టోబర్‌లో 43.1 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఈ లెక్కన మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో 73.9 లక్షల ఉద్యోగాలు రావచ్చని ఎస్బీఐ రిసెర్చ్ అంచనా వేస్తున్నది. దీంతో గతంతో పోల్చితే ఈసారి 15.8 లక్షల ఉద్యోగాలు తగ్గవచ్చని అంటున్నది. గడిచిన ఏడాది కాలంలో అస్సోం, రాజస్థాన్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాల్లో వలస కార్మికుల ఆదాయం పడిపోయిందని, వారి కుటుంబాలకు వారి నుంచి వెళ్తున్న సొమ్ము తగ్గిందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్టు-ఎకోరాప్ తెలిపింది.


వలస కార్మికులు బేజారు

స్వస్థలాల్లో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని పరాయి ప్రాంతాలకు చేరిన వలస కూలీలు, కార్మికులపై ఆర్థిక మందగమనం ప్రభావం విపరీతంగా కనిపిస్తున్నది. మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత, మందగించిన వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం ఆయా వ్యాపార, పారిశ్రామిక సంస్థల అమ్మకాలు, ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్నాయి. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న సంస్థలు.. కొత్త ఉద్యోగాల జోలికి వెళ్లడం లేదు. ఉన్న ఉద్యోగులనూ తొలగిస్తున్నాయి. తక్కువ జీతాలకే పనికి కుదుర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితులు వలస కార్మికులను బేజారు చేస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారికి ఏండ్ల తరబడి వలసలే జీవనాధారంగా ఉంటుండగా, వ్యవసాయ ప్రధాన రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ రాష్ర్టాల్లోని ప్రజలు.. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాలకు వలసపోతున్నారు. ఢిల్లీకి ఎక్కువ మంది వలస వెళ్తున్నారని, ఉద్యోగావకాశాలు సమృద్ధిగా ఉండటమే ఇందుకు కారణమని తాజా నివేదిక తెలిపింది. వీరంతా ఇప్పుడు ఆర్థిక మందగమనంతో ప్రభావితులు అవుతున్నారని వివరించింది.

దివాలా తీర్మానాల సెగ

ఉద్యోగాల కోత, నియామకాలపై దివాలా తీర్మానాల ప్రభా వం కూడా ఉంటున్నది. దివాలా తీసిన సంస్థలు రిజల్యూషన్‌కు ఆలస్యంగా వెళ్తుండటంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటున్నదని ఎస్బీఐ రిసెర్చ్ తెలిపింది. మొదటగా వీరిపైనే వేటు పడుతున్నది. ఇక పడిపోయిన ఉత్పాదక సామర్థ్యం వేతనాల వృద్ధిరేటును బలి తీసుకుంటున్నది. పెరుగుతున్న ఖర్చులకు తగ్గ ఆదాయం లేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యువతకు ఉద్యోగాలేవి?: రాజన్

దేశంలో యువతీయువకులు పెద్ద ఎత్తున ఉన్నారని, వీరిలో ఏటా ఉద్యోగార్థులుగా వస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతున్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ప్రస్తుతమున్న వృద్ధిరేటు భారత యువతకు సరిపడా ఉద్యోగాలను ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టే కీలక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 5 శాతంగానే నమోదు కావచ్చని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) అంచనా వేసిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఇది 6.8 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ దేశంలో సంస్కరణల వేగం తగ్గిందని, గత 15 ఏండ్లుగా ఇదే పరిస్థితి ఉందంటూ అసంతృప్తిని వెలిబుచ్చారు. వృద్ధిరేటు పెరిగితేనే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ఎగుమతులను పెంచుకునేలా వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణి జ్య ఒ ప్పందాలను కుదుర్చుకోవాలని కేంద్రానికి ఈ సం దర్భంగా ఆయన సూచించారు. మౌలిక రంగంలో పెట్టుబడులు పెరుగాలని, గ్రామీణుల కొనుగోళ్ల శక్తి పుంజుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ జీడీపీ 5 శాతానికి పరిమితమైంది. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 4.5 శాతానికి పడిపోయిన సంగతీ విదితమే. 


logo