సోమవారం 30 మార్చి 2020
Business - Mar 03, 2020 , 00:16:03

కార్పొరేట్‌ బాకీలు వచ్చేనా!

కార్పొరేట్‌ బాకీలు వచ్చేనా!
  • రూ.10.52 లక్షల కోట్ల రుణాలపై ఆర్థిక మందగమనం ప్రభావం
  • డిఫాల్ట్‌కు అవకాశాలు: ఇండియా రేటింగ్స్‌

ముంబై, మార్చి 2: దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న మందగమనం.. ఏకంగా పదిన్నర లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్‌ రుణాలకు ఎసరు పెడుతున్నది. మార్కెట్‌లో నెలకొన్న సుదీర్ఘ ఆర్థిక ఇబ్బందులు రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో సుమారు రూ.10.52 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలను రిస్కులో పెడుతున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తమ నివేదికలో తెలిపింది. మొత్తం కార్పొరేట్‌ రుణాల్లో ఇది 16 శాతం కావడం గమనార్హం. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు ఏడేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే పరిస్థితుల్లో కార్పొరేట్లు లేకుండా పోతున్నారని స్పష్టమవుతున్నది. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు వ్యాపారావకాశాలను తీవ్రంగా దెబ్బ తీస్తుండగా, తీసుకున్న అప్పుల్ని చెల్లించలేక కార్పొరేట్లు చేతులు ఎత్తేస్తున్నది చూస్తూనే ఉన్నాం. 


మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ఇప్పటికే బ్యాంకింగ్‌ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితులు బ్యాంకింగ్‌ వ్యవస్థకు మరింత ముప్పు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. నిర్మాణ, విద్యుత్‌, ఆటో, ఆటో అనుబంధ రంగాలు, టెలికం, మౌలిక తదితర 11 రంగాల్లో ఆస్తుల విలువ, రుణాల మంజూరుకున్న అనుకూల-ప్రతికూల పరిస్థితులను ఇండియా రేటింగ్స్‌ విశ్లేషించింది. దాదాపు 25 శాతం రుణాలు వసూలు కావడం కష్టమేనని గుర్తించినట్లు చెప్పింది. దీనివల్ల అదనంగా రూ.2.54 లక్షల కోట్ల రుణాలు ఇబ్బందుల్లో పడుతున్నాయని స్పష్టం చేసింది. అయితే ఆర్థిక పరిస్థితులు చక్కబడితే కొంతలో కొంత నయమని పేర్కొన్నది. నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్టీ, పవర్‌, టెలికం, మౌలిక రంగాల్లో ఇప్పటికే చాలా సంస్థలు తీసుకున్న అప్పులను చెల్లించలేక దివాలా తీస్తుండగా, మరికొన్ని రుణ పునర్‌వ్యవస్థీకరణకు వెళ్తున్న విషయం తెలిసిందే.


రికవరీకి ఐబీసీనే ఉత్తమం

బాకీల వసూలుకు దివాలా చట్టమే (ఐబీసీ) ఉత్తమ మార్గమని ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ప్స్రీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) చీఫ్‌ ఎంఎస్‌ సాహూ అన్నారు. రుణదాతలు గరిష్ఠంగా వివిధ కేసుల్లో రూ.1.6 లక్షల కోట్ల వసూళ్లు చేసినట్లు గుర్తుచేశారు. గతేడాది డిసెంబర్‌ నాటికి రిజల్యూషన్‌ ప్లాన్ల ద్వారా 190 కంపెనీలు బయటపడ్డాయని తెలిపారు. 2016లో ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ప్స్రీ కోడ్‌ (ఐబీసీ) అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.


logo