మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 09, 2020 , 23:40:34

ఒక్క చార్జింగ్‌తో 116 కిలోమీటర్లు

ఒక్క చార్జింగ్‌తో 116 కిలోమీటర్లు
  • మార్కెట్లోకి ఇ-ప్లూటో 7జీ స్కూటర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) హైదరాబాద్‌ సహకారంతో ప్రముఖ స్టార్టప్‌ ప్యూర్‌ ఈవీ.. మార్కెట్లోకి అత్యంత వేగవంతమైన విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈప్లూటో 7జీ’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ను   నీతి అయోగ్‌ సభ్యులు వీకే సారస్వత్‌, డీఆర్‌డీవో చైర్మన్‌ జీ సతీష్‌ రెడ్డి, ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి ఆదివారం ఆవిష్కరించారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్‌ ధరను రూ.79,999గా నిర్ణయించింది. ఒక్క చార్జింగ్‌తో 116 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ స్కూటర్‌ బ్యాటరీపై 40 వేల కిలోమీటర్ల వ్యారెంటీ సదుపాయం కల్పించింది సంస్థ. అంటే ప్రయాణానికి అయ్యే ఖర్చు కిలోమీటర్‌కు 25 నుంచి 35 పైసలు మాత్రమే కావటం గమనార్హం. ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో నెలకు 2 వేల స్కూటర్లు తయారవనున్నాయని, డిమాండ్‌ అధికంగా ఉంటే భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశం కూడా ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తొలి ఏడాదిలో 10 వేల యూనిట్ల స్కూటర్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.  


ఐఐటీ విద్యార్థుల ప్రయోగం అద్భుతం: సతీశ్‌ రెడ్డి

దేశీయ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న పరికరాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నామని డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఐటీ విద్యార్థులు ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి, నైపుణ్యాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమని, అత్యంత వేగవంతమైన ఈ-స్కూటర్‌ తయారుచేయడం మంచి పరిణామమని, వారిని మరింత చైతన్య పరిస్తే మరిన్ని నూతన ఆవిష్కరణలు జరుపవచ్చునని ఆయన పేర్కొన్నారు. 


logo
>>>>>>