శనివారం 30 మే 2020
Business - May 02, 2020 , 01:05:00

చైనా డిజిటల్‌ కరెన్సీ డాలర్‌కు చెక్‌ పెట్టనున్న డ్రాగన్‌

చైనా డిజిటల్‌ కరెన్సీ డాలర్‌కు చెక్‌ పెట్టనున్న డ్రాగన్‌

బీజింగ్‌, మే 1: కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న చైనా కీలక నిర్ణయం తీసుకున్నది.  డాలర్‌ పెత్తనానికి చెక్‌ పెడుతూ డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చింది డ్రాగన్‌. అకస్మాత్తుగా చైనా తీసుకున్న ఈ కీలక నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. చైనా ఆర్థిక చరిత్రలో ఇదో మలుపురాయిని అక్కడి విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్‌, వాణిజ్య ఒప్పందాల్లో అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పుడు కరెన్సీలకు పాకినట్లు అయింది. వచ్చే ఏడాది నాటికి కరెన్సీ మార్కెట్లో అగ్రగామి లక్ష్యంగా పావులు కదుపుతున్న చైనా...ఈ ఆర్థిక యుద్దానికి తెరలేపుతూ ‘ఈ-ఆర్‌ఎంబీ’ డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వచ్చే వారం నుంచి చైనాలోని నాలుగు నగరాల్లో అందుబాటులోకి రానున్న  ఈ డిజిటల్‌ కరెన్సీ ప్రపంచ కరెన్సీ మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి దేశంగా చైనా రికార్డును సృష్టించింది. చైనా తీసుకున్న ఈ కీలక నిర్ణయం అమెరికా ఆస్తులపై  తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నదని, గత పదేండ్లకు పైగా అగ్రస్థానంలో దూసుకుపోయిన డాలర్‌కు చెక్‌ పెట్టినట్లు అవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. 

రవాణా, ఆహారం, రిటైల్‌..

తొలి విడుతగా రవాణా, ఆహారం, రిటైల్‌ విభాగాల్లో డిజిటల్‌ కరెన్సీని వినియోగించనున్నారు. చైనా కరెన్సీ అయిన యువాన్‌కు బదులు ఈ-ఆర్‌ఎంబీ రూపంలో బిల్లులు చెల్లించవచ్చును. ఈ కరెన్సీని వినియోగించడానికి మెక్‌డొనాల్డ్‌, స్టార్‌బక్స్‌ వంటి సంస్థలు ముందుకొచ్చాయి. ప్రస్తుత నెల నుంచి పలు ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌ సర్వెంట్లు డిజిటల్‌ కరెన్సీ రూపంలో తమ జీత భత్యాలు పొందబోతున్నారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందిస్తున్న ఈ డిజిటల్‌ కరెన్సీ భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లో కీలకంకానున్నదని చైనా భావిస్తున్నట్లు అక్కడ డెయిలీ రిపోర్ట్‌ వెల్లడించింది.   


logo