గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 30, 2020 , 01:07:14

ఆగస్టులో కరోనా మందు

ఆగస్టులో కరోనా మందు

  • డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటన.. ఇతర దేశాలకు ఎగుమతి 

హైదరాబాద్‌, జూలై 29: రాష్ర్టానికి చెందిన మరో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ కూడా కరోనా వైరస్‌ ప్రాథమిక దశలో  నియంత్రించే ఔషధాలను విడుదల చేయడానికి సిద్ధమైంది.  ఇప్పటికే ఆర్‌ అండ్‌ డీలో పరిశోధనలు జరుగుతున్నాయని, వచ్చే నెలలో రెండు యాంటీవైరల్‌ ఔషధాలనైనా రెమిడెవిసిర్‌, ఫావిపిరావిర్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో సౌమెన్‌ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తోపాటు 127 దేశాల్లో ఈ ఔషధాలను తయారు చేయడం, అక్కడి మార్కెట్లో విక్రయించడానికి గత నెలలో గిలీడ్‌ సైన్స్‌ ఇండస్ట్రీతో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. వీటితోపాటు టోక్యోకు చెందిన ఫ్యూజిఫిల్మ్‌ కార్పొరేషన్‌ అండ్‌ గ్లోబల్‌ రెస్పాన్స్‌తో కలిసి అవిగన్‌ ట్యాబ్లెట్ల(ఫావిపిరావిర్‌)ను తయారు చేస్తున్నది. ఈ ఔషధాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఏషియన్‌ మార్కెట్లకు ఎగుమతి చేసే ఆలోచనలో సంస్థ ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. 

13 శాతం తగ్గిన ఏకీకృత లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.579.30 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.662.8 కోట్ల లాభంతో పోలిస్తే 13 శాతం క్షీణించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.4,417.5 కోట్లుగా నమోదైందని చక్రవర్తి వెల్లడించారు. ఏడాది క్రితం ఇది రూ.3,843.50 కోట్లుగా ఉన్నది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ సెల్‌జెన్స్‌తో కేసును సెటిల్‌ చేసుకోవడానికి రూ.346 కోట్ల నిధులను వెచ్చించాల్సి రావడం  లాభాల్లో గండిపడిందని ఆయన పేర్కొన్నారు. 

ఆర్థిక ఫలితాల్లో ముఖ్యాంశాలు..

  • భారత్‌లో ఔషధాల విక్రయం ద్వారా రూ.630 కోట్ల నిధులు సమకూరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ
  • అంతర్జాతీయంగా జనరిక్‌ మందులను విక్రయించడంతో రూ.3,507 కోట్ల నిధులు లభించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఆరు శాతం అధికం.
  • యూరప్‌, అభివృద్ధి చెందిన దేశాల్లో కంపెనీకి చెందిన జనరిక్‌ ఔషధాల విక్రయాలు భారీగా పెరిగాయి. 
  • బడ్డి, హిమాచల్‌ప్రదేశ్‌లలో వోకార్డ్‌కు ఉన్న ప్లాంట్లు కంపెనీ చేతికి వచ్చాయి. 
  • ఫార్మాస్యూటికల్స్‌ సర్వీసెస్‌, యాక్టివ్‌ ఇంగ్రిడియంట్స్‌ విభాగం ద్వారా రూ.855 కోట్ల ఆదాయం సమకూరింది. 
  • తొలి త్రైమాసికంలో ఆర్‌ అండ్‌ డీ కోసం రూ.400 కోట్ల నిధులను వెచ్చించింది. 


logo