మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 13, 2020 , 00:09:04

రెడ్డీస్‌ చేతికి వోకార్డ్‌ జనరిక్‌!

రెడ్డీస్‌ చేతికి వోకార్డ్‌ జనరిక్‌!
  • 62 బ్రాండ్లను కొనుగోలు చేయనున్న సంస్థ
  • ఒప్పందం విలువ 1,850 కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరిస్‌ లిమిటెడ్‌..వోకార్డ్‌ లిమిటెడ్‌కు చెందిన జనరిక్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. భారత్‌తోపాటు శ్రీలంక, మాల్దీవ్స్‌ల్లో విక్రయిస్తున్న 62 బ్రాండ్‌లు ఇక రెడ్డీస్‌ చేతిలోకి వెళ్లబోతున్నాయి. ఒప్పందం విలువ రూ.1,850 కోట్లు. కొనుగోలు చేయనున్న వాటిలో పలు రకాల తెరపీలతోపాటు శ్వాసక్రియ, న్యూరోలాజీ, వీఎంఎస్‌, డర్మటాలజీ, పెయిన్‌ అండ్‌ వ్యాక్సీన్స్‌లకు సంబంధించిన జనరిక్‌ మందులు రెడ్డీస్‌కి బదిలీకానున్నాయి.


ఈ మందులతోపాటు మార్కెటింగ్‌ టీం, బద్ది, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఉన్న తయారీ ప్లాంట్లు కూడా రెడ్డీస్‌ చేతిలోకి రానున్నాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ కొనుగోలు ఒప్పందం వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం నాటికి పూర్తికావచ్చునని అంచనా. ఈ సందర్భంగా కంపెనీ కో-చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ..భారత మార్కెట్‌ చాలా కీలమని, వోకార్డ్‌కు చెందిన జనరిక్‌ మందులను కొనుగోలు చేయడంతో దేశీయ వ్యాపారాన్ని గణనీయంగా పెంచడానికి దోహదం చేయనున్నదన్నారు. 2015లో ఇండియా-సెంట్రిక్‌ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసిన సంస్థ మళ్లీ ఐదేండ్ల తర్వాత భారీ స్థాయిలో కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. దీంతో వోకార్డ్‌కు చెందిన మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాక్టిన్‌, జెడెక్స్‌, బ్రో-జెడెక్స్‌, ట్రైప్టోమీర్‌, బయోవ్యాక్‌ బ్రాండ్లు రెడ్డీస్‌ చేతికి రానున్నాయి.


logo
>>>>>>