శనివారం 06 మార్చి 2021
Business - Jan 30, 2021 , 01:17:25

రెడ్డీస్‌ లాభం రూ.28 కోట్లు

రెడ్డీస్‌ లాభం రూ.28 కోట్లు

హైదరాబాద్‌, జనవరి 29: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.27.90 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ.538.4 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.38 శాతం ఎగబాకి రూ.4,941.90 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.4,397.10 కోట్లుగా ఉన్నది. గత కొన్ని త్రైమాసికాలుగా నిలకడైన వృద్ధిని సాధిస్తున్నట్లు, ముఖ్యంగా ఎబిటా మార్జిన్లు అంచనావేసిన స్థాయిలోనే ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరిస్‌ కో-చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. 

మార్చిలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌

కొవిడ్‌-19 వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడోదశలో ఉన్నదని, వచ్చే రెండు నెలల్లో ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో ట్రయల్స్‌ వచ్చే నెల చివరినాటికి పూర్తికానున్నట్లు, డీసీజీఐ అనుమతించిన వెంటనే  ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు కంపెనీ ఏపీఐఎస్‌, ఫార్మాస్యూటికల్స్‌ సర్వీసుల విభాగ సీఈవో దీపక్‌ సప్రా తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌, భారత్‌లో విక్రయానికి సంబంధించి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌)తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 3 శాతం తగ్గి రూ.4,726.60 వద్దకు జారుకున్నది.  

VIDEOS

logo