మంగళవారం 01 డిసెంబర్ 2020
Business - Oct 23, 2020 , 02:16:01

రెడ్డీస్‌పై సైబర్‌ దాడి

రెడ్డీస్‌పై సైబర్‌ దాడి

  • ఐటీ ఇన్‌ఫ్రాలో గుర్తింపు 
  • తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేత 

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌పై భారీ సైబర్‌ దాడి జరిగింది. రష్యా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పరీక్ష కోసం రెడ్డీస్‌కు భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ సైబర్‌ దాడి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. మరోవైపు ఈ దాడి గురించిన వివరాలను గురువారం స్టాక్‌ ఎక్సేంజీలతో పంచుకున్న రెడ్డీస్‌.. తమ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగంలో ఈ సైబర్‌ అటాక్‌ను గుర్తించామని తెలిపింది. కాగా, ఓ భారతీయ సంస్థపై జరిగిన భారీ సైబర్‌ దాడుల్లో ఇది కూడా ఒకటి అని విశ్లేషకులు చెప్తున్నారు. దేశీయంగా డాక్టర్‌ రెడ్డీస్‌కు 17 ఉత్పాదక కేంద్రాలు, 6 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు (ఆర్‌అండ్‌డీ సెంటర్స్‌) ఉన్నాయి. విదేశాల్లో 6 తయారీ ప్లాంట్లుండగా, 3 ఆర్‌అండ్‌డీ సెంటర్లున్నాయి.

ఆగిన ఉత్పత్తి

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెడ్డీస్‌ అన్ని ప్రధాన ప్లాంట్లను తాత్కాలికంగా మూసేసివేయడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. సంస్థ వర్గాలు సైతం దీన్ని ధ్రువీకరించాయి. ఇక ప్రస్తుతం తమ ఐటీ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ను రెడ్డీస్‌ ల్యాబ్‌ సమీక్షిస్తున్నది. ఈ దాడి ఎలా జరిగిందో పరిశీలిస్తున్నామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ‘సైబర్‌ దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కింద అన్ని డేటా సెంటర్‌ సర్వీసులను విడదీశాం. 24 గంటల్లో అన్ని సేవలు చక్కబడుతాయి. ఈ ఘటనతో సంస్థ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం పడకుండా చూస్తు న్నాం. ఉత్పత్తి పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేము’ అని రెడ్డీస్‌ సీఐవో ముకేశ్‌ రాఠీ అన్నారు.

అరబిందోకు హెచ్చరిక లేఖ

అరబిందో ఫార్మాకు అమెరికా ఆహార, ఔషధ రెగ్యులేటర్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి హెచ్చరిక లేఖ జారీ అయ్యింది. అమెరికాలోని న్యూజెర్సీలోగల తమ ఓరల్‌ సాలిడ్‌ తయారీ యూనిట్‌కు ఈ లేఖ ఇచ్చినట్లు గురువారం సంస్థ బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌కు వివరించింది. అయితే ఈ లేఖలో ఏమున్నదన్న విషయాన్ని మాత్రం సంస్థ తెలియపరుచలేదు.