శనివారం 28 నవంబర్ 2020
Business - Nov 22, 2020 , 01:25:35

ఐదేండ్లలోరెట్టింపు చమురు శుద్ధి

ఐదేండ్లలోరెట్టింపు చమురు శుద్ధి

  • చమురు రంగంలో భారీగా పెట్టుబడులు
  • 35 శాతం కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యం
  • పీడీపీయూ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ

గాంధీనగర్‌, నవంబర్‌ 21: చమురు శుద్ధి (రిఫైనింగ్‌) సామర్థ్యాన్ని రానున్న ఐదేండ్లలో రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే పదేండ్లలో చమురు, సహజ వాయువు రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. శనివారం ఆయన పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ (పీడీపీయూ) ఎనిమిదవ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. కర్బన ఉద్గారాలను 30-35 శాతం మేరకు తగ్గించుకోవాలన్న లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్నదని తెలిపారు. దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ముందే చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఒక యూనిట్‌ సౌరవిద్యుత్‌ ధర రూ.12-13 ఉండగా.. ఇప్పుడది రూ.2కు దిగివచ్చిందని చెప్పారు. ప్రస్తుతం సౌరవిద్యుత్‌కు భారత్‌ అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. 

దేశం ముంగిట రెండు భారీ లక్ష్యాలు: అంబానీ


ఆర్థిక రంగంతోపాటు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ రంగంలో బలమైన శక్తిగా ఎదగాలన్న రెండు భారీ లక్ష్యాల సాధన దిశగా దేశం ముందుకు సాగాలని పీడీపీయూకి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెట్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సూచించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు వివిధ రకాల సాంకేతికతలు, ఆవిష్కరణలు అవసరమన్నారు. ముఖ్యంగా పునర్వినియోగ ఇంధన పరిష్కారాలు, కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే ఇంధన ఉత్పత్తులు, కార్బన్‌ రీసైక్లింగ్‌కు సంబంధించిన సాంకేతికతలతోపాటు విద్యుత్‌ను నిల్వచేసుకునేందుకు ఉపకరించే ఆవిష్కరణలపై దేశం దృష్టి సారించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 మహమ్మారిపై పోరులో భారత్‌ కీలక దశలోకి ప్రవేశించిందని, ఇలాంటి తరుణంలో అలసత్వాన్ని ప్రదర్శించడం మంచిది కాదని పేర్కొన్నారు. ‘గతంలో కూడా ఎన్నో విపత్తులను ఎదుర్కొన్న భారత్‌.. ప్రతిసారి వాటి నుంచి విజయవంతంగా బయటపడి మరింత దృఢంగా ఉద్భవిస్తున్నది. ఎలాంటి ప్రతికూలతలు, సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం మనలో, మన సంస్కృతిలోనే బలంగా ఇమిడి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కరోనా సంక్షోభం తర్వాత దేశంలో వేగవంతమైన వృద్ధిని చూస్తామన్న నమ్మకం నాకున్నది. వచ్చే రెండు దశాబ్దాల్లో ఈ వృద్ధి విస్తృతమైన అవకాశాలను సృష్టిస్తుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని ముకేశ్‌ అంబానీ తెలిపారు.