మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 05, 2020 , 01:52:38

చైనా పెట్టుబడులు అక్కర్లేదు

చైనా పెట్టుబడులు అక్కర్లేదు

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ, జూలై 4: చైనా పెట్టుబడులు భారత్‌కు అక్కర్లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దేశంలోని రహదారుల ప్రాజెక్టుల్లోకి చైనా సంస్థలను రానివ్వబోమని, జాయింట్‌ వెంచర్లనూ అంగీకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రోడ్లు, రహదారుల నిర్మాణంలో భారతీయ సంస్థలే పాల్గొంటాయని చెప్పారు. ఈ మేరకు ఆర్థిక, సాంకేతిక షరతులను సులభతరం చేస్తామని శనివారం ఓ ప్రముఖ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ దేశంలోని చైనా కంపెనీల ఆనవాళ్లను మోదీ సర్కారు చెరిపేస్తున్నది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ మౌలిక రంగంపైనా చైనా నీడ లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. ‘ప్రస్తుత విధానాలను మార్చేస్తున్నాం. మౌలిక ప్రాజెక్టుల కోసం ఆర్థిక, సాంకేతిక అర్హతలను సడలిస్తున్నాం’ అన్నారు. చైనా పెట్టుబడులు రాకపోతే భారత్‌కు నిధుల కొరత వస్తుందేమోనన్న ప్రశ్నకు బదులిస్తూ ఆ దేశ పెట్టుబడులపైనే భారత్‌ ఆధారపడట్లేదన్నారు. 


logo