సోమవారం 13 జూలై 2020
Business - Jun 02, 2020 , 00:42:01

అన్‌లాక్‌ ఉత్సాహం

అన్‌లాక్‌ ఉత్సాహం

  • భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • లాక్‌డౌన్‌ సడలింపులతో కొనుగోళ్ల జోష్‌
  • సెన్సెక్స్‌ 879, నిఫ్టీ 246 పాయింట్లు వృద్ధి

ముంబై, జూన్‌ 1: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన లాక్‌డౌన్‌ సడలింపులు మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీంతో ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఇంధన రంగ షేర్లకు పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 879.42 పాయింట్లు లేదా 2.57 శాతం ఎగిసి 33,303.52 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,250 పాయింట్లు పుంజుకోవడం గమనార్హం. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 245.85 పాయింట్లు లేదా 2.57 శాతం పెరిగి 9,826.15 వద్ద నిలిచింది. ఈ నెల 8 నుంచి ‘అన్‌లాక్‌-1’ మొదలవుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌ను పెంచిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా భారతీయ ఈక్విటీలను బలపరిచాయన్నారు. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా సూచీలు 3 శాతం వరకు లాభాల్లో స్థిరపడ్డాయి. ఐరోపా దేశాల మార్కెట్లు సైతం భారీ లాభాల్లో కదలాడటం.. మదుపరులను పెట్టుబడులకు ఉసిగొల్పింది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగోరోజు సూచీలు లాభాలను అందుకోగలిగాయని ట్రేడింగ్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్ల విలువ దాదాపు 11 శాతం ఎగబాకింది. టైటాన్‌, టాటా స్టీల్‌, ఎస్బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లూ ఆకర్షణీయ లాభాలను అందుకున్నాయి. అయితే సన్‌ ఫార్మా, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తదితర షేర్లు నష్టపోయాయి. మొత్తంగా మెటల్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఇంధన, ఆటో, రియల్టీ రంగాల సూచీలు వృద్ధిని చూశాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 3.03 శాతం మేర లాభపడ్డాయి.

8 పైసలు పెరిగిన రూపాయి విలువ

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో 8 పైసలు పెరిగి 75.54 వద్ద ముగిసింది. అన్‌లాక్‌ ఎకానమీ సంకేతాలు రూపాయికి కొత్త దన్నునిచ్చాయి. ఆరంభంలోనే 75.32 స్థాయికి ఎగబాకిన రూపాయి విలువ.. ఒకానొక సమయంలో 75.29కి బలపడింది. విదేశాల నుంచి పెట్టుబడుల రాక, అమెరికా కరెన్సీ విలువ బలహీనంగా ఉండటం, దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టడం కూడా రూపాయి విలువ వృద్ధికి దోహదం చేశాయని ఫారెక్స్‌ ట్రేడర్లు అంటున్నారు.

బంగారం మార్కెట్‌ షురూ

న్యూఢిల్లీ: స్పాట్‌ గోల్డ్‌ మార్కెట్లు ఢిల్లీలో సోమవారం మళ్లీ మొదలయ్యాయి. రెండు నెలలకుపైగా బంగారం మార్కెట్లు మూతబడిన విషయం తెలిసిందే. మార్చి 25న లాక్‌డౌన్‌ మొదలవగా అప్పట్నుంచి మే 31దాకా తిరిగి తెరుచుకోలేదు. అయితే సోమవారం నుంచి మార్కెట్‌ ప్రారంభమైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. 


logo