దేశీ విమాన చార్జీల ధరలకు రెక్కలు!

న్యూఢిల్లీ : దేశీ విమానయానం ఖరీదు కానుంది. దేశీ రూట్లలో విమాన చార్జీలు 30 శాతం వరకూ పెరగనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులతో పాటు సీటింగ్ సామర్ధ్యంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించిన పరిమితులు మార్చి 31తో ముగియనుండటంతో దేశీ రూట్లలో విమాన చార్జీలకు రెక్కలు రానున్నాయి. మరోవైపు దేశవ్యాప్త రూట్లలో విమాన చార్జీల బేస్ పరిమితిని పది శాతం, గరిష్ట పరిమితిని 15 శాతం పెంచినట్టు విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక దేశంలో కొవిడ్‌కు ముందున్న పరిస్థితి క్రమంగా తిరిగి నెలకొంటున్న క్రమంలో దేశీ విమానాల చార్జీల శ్రేణిపై విధించిన పరిమితులను తొలగించే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్న మరుసటి రోజే విమాన చార్జీల శ్రేణిని ప్రభుత్వం సవరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో విమాన ట్రాఫిక్ మందగించడంతో గత ఏడాది మే 21న పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ దేశీ విమాన ఛార్జీల ప్రైస్ బ్యాండ్‌ను నిర్ధారించింది.