శనివారం 30 మే 2020
Business - Apr 04, 2020 , 00:05:30

డాలర్‌ @ రూ.76

డాలర్‌ @ రూ.76

53 పైసలు పడిపోయిన మారకం 

ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి విలువ

ముంబై, ఏప్రిల్‌ 3: దేశీయ కరెన్సీ గుబులురేపుతున్నది. రోజురోజుకు బక్కచిక్కుతున్న మారకం విలువ మరో చారిత్రక కనిష్ఠ స్థాయి 76కి జారుకున్నది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 53 పైసలు పతనం చెంది 76.13కి జారుకుంది. భారత్‌లో కరోనా వైరస్‌ భారిన పడినవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం, ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో మారకం విలువ పతనానికి ఆజ్యంపోసిందని ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు. అంతర్జాతీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ బలోపేతం కావడం ఇతర కరెన్సీలు కుదేలయ్యాయి. వారాం తం ట్రేడింగ్‌లో 75.97 వద్ద ప్రారంభమైన డాలర్‌-రుపీ ఎక్సేంజ్‌ రేటు చివరకు 53 పైసలు పడిపోయింది. వరుసగా రెండు రోజుల తర్వాత ఆరంభమైన ఫారెక్స్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణిస్తుండటం, మరోవైపు ప్రపంచ దేశాలను ఆర్థిక మాం ద్యం చుట్టుముట్టనున్నట్లు వచ్చిన సంకేతాలు ఈక్విటీలతోపాటు కరెన్సీ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ఈవారంలో కరెన్సీ 124 పైసలు పడిపోయింది. 

డెబిట్‌, కరెన్సీ మార్కెట్ల సమయం కుదింపు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెల 7 నుంచి డెబిట్‌, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్‌ సమయాన్ని తగ్గించినట్లు రిజర్వు బ్యాంక్‌ ప్రకటించింది. ఈ నెల 7 నుంచి 17 వరకు ఈ రెండు మార్కెట్లు ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నాం 2 గంటల వరకు మాత్రమే ట్రేడింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక సేవల మార్కెట్లపై పడుతున్న ప్రతికూల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జారీచేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. 


logo