సోమవారం 01 మార్చి 2021
Business - Dec 15, 2020 , 21:45:52

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలా చేయండి..

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలా చేయండి..

హైదరాబాద్‌: వచ్చే జీతంతోనే గృహ అవసరాలను తీర్చుకుంటూ పిల్లల చదువులు, పెళ్లి్ళ్ల గురించి కూడా ఆలోచించాలి. ఇవి ప్రతి బీద, మధ్యతరగతి జీవులకు ముఖ్యమైన అంశాలు. అయితే, ఈ విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. దీంతో పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ కింది సలహాలు పాటిస్తే సరి.

ద్రవ్యోల్బణంపై దృష్టిపెట్టాలి.

పిల్లల ఉన్నత విద్య, పెళ్లిళ్ల కోసం అందరూ ఎంతో కొంత జమచేస్తారు. అయితే, ఇది మరో 10-20 ఏళ్ల త‌ర్వాత స‌రిపోదు. దీనికి కార‌ణం ద్రవ్యోల్బణం. దీనివల్ల రోజు రోజుకూ ఖ‌ర్చులు పెరిగిపోతుంటాయి. అందుకే పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.

ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టండి.. 

పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈక్విటీలపై దృష్టిపెట్టండి. ఇందులో మంచి రాబడులు వస్తాయి. ఈక్విటీలు స్వల్పకాలంలో ఒడిదొడుకులకు గురవచ్చు కానీ.. దీర్ఘకాలికంగా మంచి రాబడులే తెచ్చిపెడతాయి. దీంతోపాటు బంగారం, స్థిరాస్తులపై మదుపు చేయడం ఉత్తమ మార్గం.

ఆర్థిక సాధనాల సమ్మిళితంగా ఉండాలి..

పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం పెట్టే పెట్టుబడులు ఆర్థిక సాధనాల సమ్మిళితంగా ఉండాలి. పెట్టుబడులకు తగిన రాబడులను ఇవ్వడంలో మ్యూచువల్‌ ఫండ్ల పాత్ర తక్కువేమీ కాదు. లార్జ్‌క్యాప్ ఫండ్లలో ఎక్కువ భాగం పెట్టుబ‌డులు పెట్టడంతోపాటు మిడ్ క్యాప్లపైనా దృష్టి సారించాలి. అలాగే, ఎక్స్ఛేంజ్ ఫండ్స్‌, ఇండెక్స్ ఫండ్స్‌లో విడివిడిగా లేదా రెండింటిలో క‌లిపి పెట్టుబ‌డులు పెట్టడం మంచిది. దీనికి స‌మాంతరంగా పిల్లల పేరుమీద పీపీఎఫ్‌ ఖాతా తెరవడమూ మరువవద్దు. 

క్రమంగా పెట్టుబడులు పెట్టాలి.. 

ఒకేసారి ఏక మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టడం కంటే క్రమానుగత పెట్టుబ‌డుల ప‌థ‌కాల ‌(సిప్‌)ను ఎంచుకోండి. ఏక మొత్తంలో కాకుండా క్రమంతప్పకుండా..స్థిరంగా కొంత మొత్తాల‌ను పెట్టాలి. సిప్‌ల‌లో మ‌దుప‌రులు మార్కెట్లు ప‌డిపోయిన‌ప్పుడు అధిక యూనిట్లు, రాణిస్తున్నప్పుడు త‌క్కువ యూనిట్లను చేజిక్కించుకునే సౌల‌భ్యం ఉంది. దీనిని రూపాయి-వ్యయ స‌గటు (రూపీ కాస్ట్ యావ‌రేజింగ్‌) అంటారు.

పెట్టుబ‌డుల స‌మ‌తౌల్యాన్ని ప‌రిశీలించండి..

పెట్టుబ‌డుల స‌మ‌తౌల్యాన్ని క్రమం తప్పకుండా ప‌రిశీలిస్తూ ఉండాలి. దీనికి సుల‌భ‌మైన మార్గం మీ ఫండ్ బ్యాలెన్స్‌ను 36 వాయిదాలుగా విభ‌జించి క్రమానుగత బ‌దిలీ ప‌థ‌కాన్ని అమ‌లు చేయండి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo